Telugu Global
Andhra Pradesh

జగనన్న ఇళ్లపై తగ్గేదే లేదు.. ఈనెల 24న శంకుస్థాపన

కేంద్రం వాటా సంగతి తేలకపోయినా బ్యాంకు రుణాల ద్వారా పని ప్రారంభిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈనెల 24న సీఎం జగన్ అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.

జగనన్న ఇళ్లపై తగ్గేదే లేదు.. ఈనెల 24న శంకుస్థాపన
X

అమరావతి ఆర్-5 జోన్ లో జగనన్న ఇళ్ల నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తూనే, మరోవైపు ఇళ్ల నిర్మాణాన్ని మొదలు పెట్టాలని తీర్మానించింది. ఆమధ్య కేంద్రం శుభవార్త చెప్పినా ఆ తర్వాత నిధులిచ్చే విషయంలో కొర్రీలు పెట్టింది. కోర్టు కేసులు తేలాకే కేంద్రం నిధులు విడుదలయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ముందు శంకుస్థాపనలు చేసి ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టాలనే ఆలోచన చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. బ్యాంకు రుణాల ద్వారా పని ప్రారంభిస్తోంది. ఈనెల 24న సీఎం జగన్ అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.

అమరావతిలోని ఆర్‌-5 జోన్‌ లో బయటి ప్రాంతాలకు చెందిన 47,017 మందికి ఇళ్లు నిర్మించబోతున్నారు. ఇప్పటికే పట్టాలు పంపిణీ చేశారు, లే అవుట్లు వేశారు, ఇతర మౌలిక సదుపాయాల పనులు మొదలు పెడుతున్నారు. ఈనెల 24న సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయాల్సి ఉంది. జగనన్న లే అవుట్లు, జగనన్న ఇళ్లు అని చెప్పుకుంటున్నా.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(PMAY) ద్వారా ఇచ్చే ఆర్థిక సాయంతో ఏపీలో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. కేంద్రం ఇచ్చేది రూ.1.50 లక్షలు, రాష్ట్రం వాటా 30వేలు. ఇదీ లెక్క. అమరావతిలో మాత్రం PMAY విషయంలో కాస్త ఇబ్బంది వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వాటాతోపాటు, బ్యాంకుల రుణంతో ముందు పని మొదలు పెట్టాలని భావిస్తున్నారు అధికారులు.

రాష్ట్రవాటా 141 కోట్ల రూపాయలు, బ్యాంకులు ఇచ్చే రుణం 164.50 కోట్లు కలిపి ఇక్కడ ఇళ్ల నిర్మాణం మొదలు పెడతారు. వాస్తవంగా ప్రతి ఇంటికి 1.80 లక్షల రూపాయలు కేటాయిస్తున్నారు. కానీ ఇక్కడ 65వేల రూపాయలతో పని మొదలు పెట్టాల్సి వస్తోంది. కోర్టు కేసుల్లో తుదితీర్పు ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి అనుకూలంగా వస్తే కేంద్రం నిధులతో రాష్ట్రం ఒడ్డునపడుతుంది. వ్యతిరేకంగా వస్తే మొదటికే మోసం వస్తుంది. అయితే పేదల ఇళ్ల విషయంలో కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చినా, దాన్ని ప్రతిపక్షాలపైకి నెట్టివేసి మరింత సింపతీ సాధించవచ్చు. ప్రస్తుతానికి ఇదే వైసీపీ ఎత్తుగడ. అందుకే ఆర్-5 జోన్లోకి సీఎం జగన్ ఈనెల 24న ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

First Published:  13 July 2023 2:12 AM GMT
Next Story