Telugu Global
Andhra Pradesh

బాబు భ్రమల్లో నెట్టారు.. జగన్ జీవం పోశారు..

తాము ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలేదని, పేదలకు ఇళ్ళు ఇవ్వటాన్ని ఎవరైనా ఎలా తప్పు పడతారని ప్రశ్నించారు సజ్జల. ఇళ్ళ స్థలాలు ఇచ్చేది మొక్కలు పెంచటానికా అని సూటిగా ప్రశ్నించారు.

బాబు భ్రమల్లో నెట్టారు.. జగన్ జీవం పోశారు..
X

అమరావతి ఆర్-5 జోన్‌ లో ఇళ్ల నిర్మాణాలకు త్వరలో సీఎం జగన్ శంకుస్థాపన చేయబోతున్నారు. కోర్టు కేసులున్నా కూడా ప్రభుత్వం అడుగు ముందుకే వేసింది. ఆరు నెలల్లో ఇక్కడ 50వేల ఇళ్లు పూర్తి చేస్తామని చెప్పారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ జీవం లేదని అన్నారాయన. చంద్రబాబు ఇక్కడ రాజధాని అనే ఒక భ్రమను మాత్రం సృష్టించారని ఎద్దేవా చేశారు. సంపన్న వర్గాలు మాత్రమే ఉండాలనే ఉద్దేశం టీడీపీ వారిదని మండిపడ్డారు సజ్జల. ఇక్కడ ఉన్న రైతులు, కూలీలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే వలస వెళ్ళి పోయారని, రైతుల ముసుగులో ఉన్న టీడీపీ నేతలు మాత్రమే ఇక్కడ ఉన్నారని చెప్పారు.

అమరావతిలో పేదలు ఉండటం ఇష్టంలేని చంద్రబాబు కేంద్రానికి, ఏజెన్సీలకు లేఖలు రాస్తున్నారని.. విమర్శించారు. ఇళ్ళ నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని, అది తమ చిత్తశుద్ధి అని చెప్పారు. అన్ని సౌకర్యాలతో ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఇలాంటి లే అవుట్లు వేయలేదన్నారు సజ్జల. ఐదేళ్లలో ఇక్కడ ఉన్న వారందరూ కోటీశ్వరులు అవడం ఖాయమన్నారు.

పేదలకు ఇళ్లు కట్టిస్తే తప్పేంటి..?

తాము ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలేదని, పేదలకు ఇళ్ళు ఇవ్వటాన్ని ఎవరైనా ఎలా తప్పు పడతారని ప్రశ్నించారు సజ్జల. ఇళ్ళ స్థలాలు ఇచ్చేది మొక్కలు పెంచటానికా అని సూటిగా ప్రశ్నించారు. లేక చంద్రబాబు చెప్పినట్లు సమాధుల కోసమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్ సంస్థలకు 3వేల ఎకరాలిచ్చిన చంద్రబాబు, పేదలకు స్థలాలిస్తుంటే ఎందుకంత గింజుకుంటున్నారని అన్నారు సజ్జల.

First Published:  22 July 2023 5:13 PM GMT
Next Story