Telugu Global
Andhra Pradesh

బాబు కోసం పార్టీని పణంగా పెడుతున్న పురందేశ్వరి..?

ఇప్పుడు పురందేశ్వరి శ్రమని నందమూరి, నారా ఫ్యామిలీ గుర్తిస్తున్నారు. కానీ.. రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం ఆమె తీరుపై పెదవి విరుస్తున్నారు.

బాబు కోసం పార్టీని పణంగా పెడుతున్న పురందేశ్వరి..?
X

చంద్రబాబుని రక్షించడానికి టీడీపీనే కాదు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న ఒత్తిడి కాబోలు.. అమిత్ షాతో నారా లోకేష్‌కి అపాయింట్‌మెంట్ ఇప్పించడమే కాకుండా దగ్గర ఉండి వారి భేటీ సాఫీగా జరిగేలా సాయపడ్డారు. కానీ నారా లోకేష్ మాత్రం అమిత్ షా పిలిస్తేనే తాను వెళ్లాను అని చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి వేరని అందరికీ తెలుసు. ఇప్పుడు పురందేశ్వరి శ్రమని నందమూరి, నారా ఫ్యామిలీ గుర్తిస్తున్నారు. కానీ.. రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం ఆమె తీరుపై పెదవి విరుస్తున్నారు.

బీజేపీ కేడర్ యాక్టీవ్.. కానీ ఒక్కరోజుతో ఢమాల్

ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు చేపట్టిన తర్వాత కేడర్ యాక్టీవ్ అయ్యింది. అధికార వైయస్‌ఆర్‌సీపీపై ఆమె ఘాటుగా విమర్శలు గుప్పిస్తూ.. మద్యం ధరలు, అమ్మకాలపై నిరసనలు వ్యక్తం చేస్తోంది. అలానే సోషల్ మీడియా వేదికగానూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. దాంతో రాబోవు ఎన్నికల్లో బీజేపీ తన ఓటు బ్యాంక్‌ని పెంచుకునే దిశగా అడుగులు పడుతున్నాయని ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కానీ.. నారా లోకేష్‌తో కలిసి అమిత్ షాతో ఆమె భేటీ అవడంతో ముసుగు తొలిగిపోయిందని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. దాంతో ఆ భేటీని సమర్థించుకోలేక ఆత్మరక్షణలో బీజేపీ నాయకులు, కేడర్ పడిపోయింది.

మళ్లీ బాబు ట్రాప్‌లోకి బీజేపీ?

2014 ఎన్నికల్లో చంద్రబాబు ట్రాప్‌లో పడిన బీజేపీ.. తగిన మూల్యం చెల్లించుకుంది. ఆ ఎన్నికల్లో జనసేన, బీజేపీ భుజాలపై నిల్చొని అధికారంలో వచ్చిన చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకి తెరదీశారు. దాంతో 2019 ఎన్నికల నాటికి టీడీపీకి జనసేన, బీజేపీ శత్రువులు అయ్యాయి. కానీ.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు తన అవసరాల కోసం జనసేనని ట్రాప్‌లోకి లాగేశారు. ఇక బీజేపీ వంతు కాగా.. పురందేశ్వరి ఆ దిశగా వడివడిగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఒకవేళ మళ్లీ టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే.. అది కచ్చితంగా రాష్ట్రంలో ఆ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ఒంటరిగా వెళ్లినా నాలుగు ఓట్లొస్తాయ్!

ఏపీలో టీడీపీ ఇప్పుడు బలహీనపడిపోయింది.. జనసేన గత దశాబ్ద కాలంగా బలప్రదర్శనకే పరిమితమైంది. దాంతో రెండో పార్టీగా ఎదిగేందుకు బీజేపీకి ఇప్పుడు మంచి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆరు నెలలు కాస్త ప్రజల్లో ఉండి ఓటు బ్యాంక్‌ని పెంచుకోవడం ద్వారా రాష్ట్రంలో బలపడే ఛాన్స్‌ ఉన్నా.. బాబు కోసం పార్టీని పురందేశ్వరి పణంగా పెడుతోందని విమర్శలు వస్తున్నాయి. పొత్తులు లేకుండా ఒంటరిగా వెళ్లినా కనీసం 1-2 సీట్లు గెలిచే అవకాశం ఉందని.. అలా కాకుండా బాబుని మళ్లీ నమ్మి వెళితే ప్రజలు విశ్వసించరని ఆమెకి హితవు పలుకుతున్నారట. కానీ.. బంధుత్వం మత్తులో ఉన్న పురందేశ్వరి ఇప్పుడు ఎవరి మాట వినే పరిస్థితిలో లేరట.


First Published:  13 Oct 2023 2:46 AM GMT
Next Story