Telugu Global
Andhra Pradesh

పురందేశ్వ‌రి స్థాయికి పెద్ద ప‌రీక్ష‌

పురందేశ్వరి ఫిర్యాదుపై హోంశాఖ విచారణ మొదలుపెడుతుందా లేకపోతే పక్కన పెట్టేస్తుందా? అన్నది చూడాలి. ఫిర్యాదును పక్కన పెట్టేస్తే పరీక్షలో పురందేశ్వరి ఫెయిలైనట్లే అర్థం.

పురందేశ్వ‌రి స్థాయికి పెద్ద ప‌రీక్ష‌
X

రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి పెద్ద పరీక్ష ఎదురైంది. పరీక్ష ఎవరో పెట్టలేదు తనకు తాను పెట్టుకున్నారు. మరీ పరీక్షలో పాస్ అవుతారా? ఇంతకీ విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు చేస్తూ కేంద్ర హోం అమిత్ షాకు రాతపూర్వ‌కంగా ఫిర్యాదు చేశారు. వెంటనే తన ఆరోపణలపై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. పురందేశ్వరి చేసిన ఆరోపణలు ఏమిటంటే లిక్కర్ అమ్మకాల్లో జగన్+మద్దతుదారులు వేల కోట్ల రూపాయలు దోచేసుకుంటున్నారట.

ఒకప్పుడు మద్యం అమ్మకాలను వేలం పాటల్లో ప్రైవేటు వ్యక్తులకు కేటాయించిన ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వమే నిర్వహిస్తోందన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటో మాత్రం చెప్పలేదు. మద్యం అమ్మకాల్లో 80 శాతం నగదు లావాదేవీల్లోనే జరుగుతున్నట్లు ఆరోపించారు. డిజిటల్ పేమెంట్ రూపంలో కాకుండా అమ్మకాలు నగదు లావాదేవీల్లోనే జరపాల్సిన అవసరం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఇది వాలిడ్ పాయింటే.

అమ్మకాల్లో వస్తున్న ఆదాయంలో సగం ప్రైవేటు వ్యక్తులకే వెళుతున్నట్లు చెప్పారు. మరి తన ఆరోపణలకు పురందేశ్వరి ఆధారాలను చూపించింది లేనిది తెలియ‌దు. ఏడాదికి రూ.57 వేల కోట్ల ఆదాయం వస్తుంటే ప్రభుత్వం మాత్రం రూ.32 వేల కోట్లే వస్తోందని చెబుతోందట. అంటే పురందేశ్వరి లెక్కల ప్రకారం ఏడాదికి రూ.25 వేల కోట్ల అవినీతి జరుగుతోంది. మద్యం డిస్టిలరీలన్నింటినీ వైసీపీ నేతలే నిర్వహిస్తున్నట్లు కూడా చెప్పారు. దీంట్లోనే చీప్ లిక్కర్ తయారు చేసి జనాల ప్రాణాలకు హాని కలిగిస్తున్నట్లు మండిపడ్డారు.

సరే, ఈ ఆరోపణలన్నీ చాలాకాలంగా ఆమె చేస్తున్నవే. అయితే ఆరోపణలకు తగ్గట్లుగా ఆమె ఎలాంటి ఆధారాలను సమర్పించారన్నదే కీలకం. తన ఫిర్యాదుపై అమిత్ షా ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. పురందేశ్వరి ఫిర్యాదుపై హోంశాఖ విచారణ మొదలుపెడుతుందా లేకపోతే పక్కన పెట్టేస్తుందా? అన్నది చూడాలి. ఫిర్యాదును పక్కన పెట్టేస్తే పరీక్షలో పురందేశ్వరి ఫెయిలైనట్లే అర్థం. ఇప్పటి పరిస్థితుల్లో జగన్‌కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందని ఎవరు అనుకోవటంలేదు. ఇంత చిన్న విషయం తెలియ‌కుండానే పురందేశ్వరి ఫిర్యాదు చేశారా?


First Published:  9 Oct 2023 5:26 AM GMT
Next Story