Telugu Global
Andhra Pradesh

అప్పుడివి గుర్తులేవా చంద్రబాబూ..?

‘కుటుంబ వికాసం’ అనే ఒక విప్లవాత్మక పథకం తెస్తాననీ, దాంతో ప్రజల జీవితాన్ని మార్చేస్తానని మొన్న ఒక సభలో అతిగా మాట్లాడారు. మీ కుటుంబ వికాసం మాకు తెలియనిదా..?

అప్పుడివి గుర్తులేవా చంద్రబాబూ..?
X

నేను గనక ఈసారి అధికారంలోకి వస్తే మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం, నేను ముఖ్యమంత్రిని అయిపోతే, మీ అందరికీ మూడేసి గ్యాస్‌ సిలిండర్లు..! మీ చేతుల్లో డబ్బు, మీ బతుకుల్లో వెలుగు అంటూ పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్‌ కదా చంద్రబాబూ. విభజిత ఆంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు బీభత్సంగా పరిపాలించినప్పుడు ఇవన్నీ గుర్తుకురాలేదా సారూ..! అప్పుడు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అవసరం లేదా..? అప్పుడు గ్యాస్‌ సిలిండర్లు ఇవ్వాలన్న కామన్‌సెన్స్‌ పనిచేయలేదా..? పళ్లురాలగొట్టి, 23 సీట్లు చేతిలో పెడితేనే గానీ, తమకి జ్ఞానోదయం కాలేదా..? 151 సీట్లతో, తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్‌ని తిట్టే అర్హత ఉందా మీకు..?

‘కుటుంబ వికాసం’ అనే ఒక విప్లవాత్మక పథకం తెస్తాననీ, దాంతో ప్రజల జీవితాన్ని మార్చేస్తానని మొన్న ఒక సభలో అతిగా మాట్లాడారు. మీ కుటుంబ వికాసం మాకు తెలియనిదా..? నమ్మిన సొంతమామ ఎన్టీఆర్‌ కుటుంబ వికాసానికి తమరు చేసిన మేలు తెలుగుజాతికి బాగా తెలుసు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుని మీరు వంచించి, అవమానించిన తీరూ అందరూ చూసి ఉన్నారు.

కుటుంబ వికాసం అంటే తమరి యొక్క సొంత వ్యాపార సామ్రాజ్య విస్తరణ అని కూడా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. పుత్రుడు లోకేష్‌ వ్యాపారస్తుడు, సతీమణి భువనేశ్వరి ఆరితేరిన బిజినెస్‌ ఉమెన్‌. వేల కోట్ల టర్నోవర్‌తో హెరిటేజ్‌ని ‘కామధేనువు’గా మారుస్తున్న కోడలు బ్రాహ్మణి బిజినెస్‌ టైకూన్‌. వీటన్నింటిపైనా సీఈవోగా తమరి పెత్తనం..!

ఆహా, ఇంత వికారమైన వ్యాపారస్తుడివి, ప్రజల మనిషిని అనీ, కుటుంబ వికాసం అనీ నీతి వాక్యాలు వల్లిస్తుంటే, వినేవాళ్లకి కడుపులో తిప్పినట్టూ, వెన్నులో ఓ బాకు దిగుతున్నట్టూ అనిపించదూ..! అది నోరా..?

First Published:  28 Jan 2024 9:45 AM GMT
Next Story