Telugu Global
Andhra Pradesh

శ్రీవారి స‌న్నిధిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతిని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ వై.వీ.సుబ్బారెడ్డి, ఈవో ధ‌ర్మారెడ్డి, అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

శ్రీవారి స‌న్నిధిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
X

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని సోమవారం ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఉదయం 9.30 గంటలకు తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుంచి బయలు దేరి తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహస్వామివారిని ద‌ర్శించుకున్నారు.

అనంత‌రం శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతిని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ వై.వీ.సుబ్బారెడ్డి, ఈవో ధ‌ర్మారెడ్డి, అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయంగార్‌ స్వామి ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ప్రధాన అర్చకులలో ఒకరైన వేణుగోపాల్ దీక్షితులు శ్రీవారి ఆలయ ప్రాశస్త్యాన్ని , సన్నిధిలోని ఇతర ఆలయాల గురించి వివరించారు.


రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదాశీర్వచనం చేశారు. చైర్మ‌న్‌, ఈవో కలిసి శ్రీవారి శేష వస్త్రాన్ని, తీర్థప్రసాదాలను, రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి రోజా, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టర్ వెంకట రమణా రెడ్డి, అదనపు డీజీ రవిశంకర్ అయ్యర్, డీఐజీ రవిప్రకాష్, సీవీ ఎస్ఓ నరసింహ కిషోర్, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

First Published:  5 Dec 2022 8:25 AM GMT
Next Story