Telugu Global
Andhra Pradesh

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సన్నాహాలు.. మళ్లీ తెరపైకి రాజధానుల బిల్లు..

మూడు రాజధానుల విషయంపై కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చ జరిగే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా వినపడుతున్నాయి. కోర్టు కేసుల నేపథ్యంలో మూడు రాజధానుల బిల్లుని వెనక్కు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, త్వరలోనే సమగ్ర రూపంలో దాన్ని తెరపైకి తేవాలనుకుంటోంది.

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సన్నాహాలు.. మళ్లీ తెరపైకి రాజధానుల బిల్లు..
X

మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గినట్టే అనిపించినా, పూర్తిగా ఆ ప్రతిపాదన విరమించుకోలేదనే విషయం మంత్రుల మాటల్లో స్పష్టమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈనెలలో అసెంబ్లీ సమావేశాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. న్యాయస్థానంలో ఇబ్బంది లేకుండా, లొసుగులు లేకుండా సమగ్ర బిల్లుతో ప్రభుత్వం సిద్ధమవుతుందా, లేక వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానులే ప్రధాన అజెండాగా ప్రచారానికి దిగేందుకు ఆ అస్త్రాన్ని దాచిపెడుతుందా అనేది వేచి చూడాలి.

ఈనెల 7న కేబినెట్..

ఈనెల 7న‌ ఏపీ కేబినెట్ మీటింగ్ జరగాల్సి ఉంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ మీటింగ్ ఇటీవల 7వతేదీన ముహూర్తం ఖరారు చేసుకుంది. ఈ కేబినెట్ మీటింగ్ లో నియోజకవర్గాలకు కేటాయించే నిధులు, సచివాలయాల వారీగా ఇచ్చే నిధులపై ఓ క్లారిటీ వస్తుంది. నాడు-నేడు బ్యాలెన్స్ పనులు, ఇతర కీలక అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశముంది. అయితే మూడు రాజధానుల విషయంపై కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చ జరిగే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా వినపడుతున్నాయి. కోర్టు కేసుల నేపథ్యంలో మూడు రాజధానుల బిల్లుని వెనక్కు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, త్వరలోనే సమగ్ర రూపంలో దాన్ని తెరపైకి తేవాలనుకుంటోంది. ఈనెల చివరి వారంలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున బిల్లు తిరిగి తెస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ కేబినెట్ లో బిల్లుపై చర్చ జరిగితే మాత్రం ఈ సమావేశాల్లోనే రాజధానుల భవిష్యత్ ఏంటనేది తేలిపోతుంది.

వారం రోజులే సమావేశాలు..

ఈనెల 24లోపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది. అందుకే మూడో వారంలో సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. వారం రోజులపాటు సమావేశాలు జరుగుతాయని అంటున్నారు. చంద్రబాబు ఈ సమావేశాలకు వస్తారా.. రారా.. అనేది తేలాల్సి అంశం. గతంలో ఏపీ అసెంబ్లీని బహిష్కరిస్తున్నానని చెప్పిన ఆయన, రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అసెంబ్లీకి వచ్చి ఓటు వేశారు. ఆయన రాకను వైసీపీ నేతలు వెటకారం చేశారు. ఒట్టుతీసి గట్టునపెట్టారా అని విమర్శించారు. ఈ క్రమంలో చంద్రబాబు అసెంబ్లీకి వస్తారా లేక, మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశాల్లో పార్టీ వాణి వినిపిస్తారా అనేది తేలాల్సి ఉంది.

First Published:  1 Sep 2022 9:43 AM GMT
Next Story