Telugu Global
Andhra Pradesh

జగన్ నాతో కలువు, పవన్ నాతో కలువు.. మోదీ నాకు భయపడు..

జగన్ తన పార్టీలో చేరితే తానే అన్నీ చూసుకుంటానని అన్నారు పాల్. జిల్లాల్లో తన సమావేశాలు జరుగుతున్నాయని, తనకు సభలు, సమావేశాలు పెట్టేందుకు పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్‌ చేస్తే.. ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు.

జగన్ నాతో కలువు, పవన్ నాతో కలువు.. మోదీ నాకు భయపడు..
X

ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ ని తనతో కలవాలని చెబుతూ వచ్చిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేేఏపాల్, ఇప్పుడు జగన్ ని కూడా తనతో కలవాలని చెబుతున్నారు. జగన్ తండ్రి, తల్లి తనకు ఎంతో గౌరవం ఇచ్చారని, కానీ జగన్ మాత్రం తనను కలవడానికి ఆసక్తి చూపడం లేదని చెప్పారు. జగన్ సీక్రెట్‌గా అయినా ఆహ్వానిస్తే తానే వెళ్లి కలుస్తానని చెప్పారు పాల్. రాష్ట్ర ప్రజలకు జగన్ మేలు చేయాలని, అప్పులు, ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని జగన్ కి ఇచ్చి వెళ్లారని, జగన్ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి అధికారంలోకి‌ వచ్చారని చెప్పారు. నవ రత్నాలకు ఇవ్వడానికి ఇక ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, అయితే తనను కలిస్తే పరిష్కారం చూపిస్తానని లేదా జగన్ తన పార్టీలో చేరితే తానే అన్నీ చూసుకుంటానని అన్నారు పాల్. జిల్లాల్లో తన సమావేశాలు జరుగుతున్నాయని, తనకు సభలు, సమావేశాలు పెట్టేందుకు పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్‌ చేస్తే.. ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు.

మీడియాని కొనేస్తున్నారు..

పనిలో పనిగా కొన్ని మీడియా సంస్థలని ఆకాశానికెత్తేశారు కేఏ పాల్. దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షించే మీడియా ఓనర్స్, ప్రతినిధులకు దేవుని ఆశీస్సులు ఉండాలన్నారు పాల్. అదానీ లాంటి వాళ్లు మీడియాను కొనేస్తున్నారని అన్నారు. వినకపోతే చంపే‌వరకూ వెళుతున్నారని చెప్పారు. ప్రజా స్వామ్యం చనిపోతుందని తాను ముందే చెప్పానని, ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. కొంతమంది న్యాయ మూర్తులను కూడా నాయకులు బెదిరించే స్థాయికి వచ్చారని చెప్పారు. నేషనల్ మీడియా ఒత్తిళ్లకు లొంగి అమ్ముడుపోయిందని, కానీ తెలుగు మీడియా భయపడకుండా వార్తలు ఇస్తోందని చెప్పారు. అటువంటి టీవీ, పేపర్ యాజమాన్యాలకు అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు.

బ్యాలెట్ అయితే నాదే విజయం..

ఈవీఎంలతో ఓటింగ్ జరిగితే బీజేపీకి 300 సీట్లు వస్తాయని తాను ముందే చెప్పానని, బ్యాలెట్ విధానంలో ఎన్నికలు పెడితే తనదే విజయం అని అన్నారు. ప్రజా శాంతి‌పార్టీలో చేరేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేతలపై సిబిఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిందన్నారు పాల్. ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పారు.

భారత్ అప్పుల కుప్ప..

మన దేశం మరో శ్రీలంక లాగా మారుతోందని చెప్పారు కేఏపాల్. మోదీ 76 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని, ఏపీకి ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఉందని, తెలంగాణలో ఐదు కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారో తెలియడం లేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ, కుల, కుట్ర రాజకీయాలకు చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మార్పు కోసం ప్రజలంతా కలిసి రావాలన్నారు.

రోగికి డాక్టర్ మెడిసిన్ ఇచ్చిన విధంగా.. ఈ దేశానికి మంచి మందు కావాలని అన్నారు పాల్. దేశ ఆర్థిక‌ పరిస్థితి గమనించి, సరి దిద్దాలని చెప్పారు. దేశ, రాష్ట్ర నాయకులు ప్రభుత్వ సంపదను వారి పార్టీ నేతలకు, కార్యకర్తలకు దోచి పెడుతున్నారని అన్నారు. అదానీకి అన్యాయంగా ఆస్తులు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తాను చెప్పిన సలహాలను పట్టించుకోలేదని, ఆయన ప్రధానమంత్రి కావడానికి, కొడుకు లోకేష్ ని సీఎం చేయడానికి రాష్ట్రాన్ని నాశనం చేశారని చెప్పారు. ఐదేళ్లలో రాజధాని కట్టలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. మోదీ చేసిన అన్యాయాన్ని ప్రశ్నించలేదని, చంద్రబాబు కు వయసు మళ్లిందని ఇప్పుడైనా ఆయన తనకు మద్దతివ్వాలని చెప్పారు. చంద్రబాబు, జగన్, తాను ముగ్గురం ఒకే వేదిక పై చర్చకు సిద్ధ‌మవుతామని అన్నారు.

దశావతారాలు వద్దు పవన్..

పవన్ కల్యాణ్ కి మరోసారి బంపర్ ఆఫర్ ఇచ్చారు పాల్. ఈ అన్నయ్యను నమ్ము అంతా మంచే జరుగుతుంది, అంతే కాని దశావతారాలు వద్దు పవన్ అని అన్నారు పాల్. తమ్ముడు ముందుకు వస్తే.. కలిసి పని చేస్తామని అన్నారు. చివరిగా కమ్యూనిస్టులంటే కూడా తనకు ప్రత్యేకమైన గౌరవం ఉందని ముక్తాయించారు పాల్.

First Published:  26 July 2022 10:47 AM GMT
Next Story