Telugu Global
Andhra Pradesh

ఏబీవీకి పోస్టింగ్.. ఎల్లో మీడియా అల్ప సంతోషం

ఉద్దేశ పూర్వకంగానే సీఎస్ జవహర్ రెడ్డి, ఏబీవీని విధులకు దూరం పెట్టారని ఎల్లో మీడియా ఇన్ని రోజులు కోడై కూసింది. చివరి రోజు ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని సీఎస్ ఆదేశాలివ్వడంతో వారి కడుపుమంట చల్లారింది.

ఏబీవీకి పోస్టింగ్.. ఎల్లో మీడియా అల్ప సంతోషం
X

చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన వివాదాస్పద ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి సరిగ్గా పదవీ విరమణ రోజున పోస్టింగ్ ఆర్డర్లు వచ్చాయి. సస్పెండ్ అయిన ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలంటూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని.. ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎల్లో మీడియా పండగ చేసుకుంటోంది. ఇది టీడీపీ విజయంగా ప్రచారం చేస్తోంది.

ఎందుకీ గోల..?

ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు.. చంద్రబాబుకోసం చాలా అక్రమాలు చేశారనే ఆరోపణలున్నాయి. వైసీపీ నేతలపై అక్రమ నిఘా పెట్టడం, వారిపై కేసులు బనాయించడం.. ఇలా చాలా దారుణాలు చేశారని ఆయనపై విమర్శలున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊహించినట్టుగానే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ తర్వాత క్యాట్ ఆదేశాలతో తిరిగి విధుల్లోకి తీసుకున్నా, మరోసారి సస్పెండ్ అయ్యారు ఏబీవీ. మళ్లీ కోర్టుల చుట్టూ తిరిగి ఎట్టకేలకు పదవీ విరమణ రోజు సింగిల్ డే డ్యూటీ చేస్తున్నారు. ఉద్దేశ పూర్వకంగానే సీఎస్ జవహర్ రెడ్డి, ఆయన్ను విధులకు దూరం పెట్టారని ఎల్లో మీడియా ఇన్ని రోజులు కోడై కూసింది. చివరి రోజు ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని సీఎస్ ఆదేశాలివ్వడంతో వారి కడుపుమంట చల్లారింది.

అవినీతి అధికారికి, అక్రమాలకు పాల్పడ్డారని రుజువైన అధికారికి ఎల్లో మీడియా వంతపాడటం ఎంతవరకు కరెక్ట్..? అని అంటున్నారు వైసీపీ నేతలు. ఆయన ఒక్కడికోసం టీడీపీ అనుకూల మీడియా మొత్తం కదిలింది. చివరకు ఆయన అహాన్ని తృప్తిపరుస్తోంది. చంద్రబాబుకి సేవ చేసినందుకు ఆయన అనుకూల మీడియా ఉచిత ప్రచారంతో ఏబీవీ టాక్ ఆఫ్ ఏపీగా మారారు. వన్ డే వండర్ గా మిగిలిపోతున్న ఏబీవీని చూసి ఎల్లో మీడియా అల్పసంతోషం పట్టలేకపోవడం విశేషం.

First Published:  31 May 2024 5:43 AM GMT
Next Story