Telugu Global
Andhra Pradesh

టీడీపీలోకి వైఎస్‌ సునీతకు స్వాగతమంటూ భారీగా పోస్టర్లు.. ప్రొద్దుటూరులో కలకలం

ఆ పోస్టర్లలో సునీత తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి, భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫొటోలు ఉన్నాయి. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్, జిల్లా నాయకులు ఆర్. శ్రీనివాసులు రెడ్డి, బీటెక్ రవి ఫొటోలు కూడా ఉన్నాయి.

టీడీపీలోకి వైఎస్‌ సునీతకు స్వాగతమంటూ భారీగా పోస్టర్లు.. ప్రొద్దుటూరులో కలకలం
X

ప్రొద్దుటూరు పట్టణంలో సోమవారం అర్ధరాత్రి వైఎస్ సునీత పేరిట వెల‌సిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పట్టణ వ్యాప్తంగా పోస్టర్లను అతికించినట్లు తెలుస్తోంది. ఆ పోస్టర్లలో టీడీపీలో చేరనున్న వైఎస్ సునీతకు స్వాగతం.. సుస్వాగతం.. అని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది. ఈ పోస్టర్లు ప్రస్తుతం రాజకీయంగా కాకపుట్టిస్తున్నాయి. కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.

ఆయన తనయుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా త్వరలో అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అవినాష్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి మద్దతుదారులు కొంతమంది వైఎస్ సునీత త్వరలో టీడీపీలో చేరబోతుంద‌న్నార‌ని, ఆ పార్టీ నేతలతో కలిసి సునీత అవినాష్ రెడ్డి కుటుంబాన్ని వివేకా హత్య కేసులో ఇరికిస్తున్నార‌ని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి ప్రొద్దుటూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో, ప్రధాన కూడళ్ళలో టీడీపీలో చేరనున్న వైఎస్ సునీతకు స్వాగతం.. సుస్వాగతం.. అని పోస్టర్లు వెలిశాయి.

ఆ పోస్టర్లలో సునీత తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి, భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫొటోలు ఉన్నాయి. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్, జిల్లా నాయకులు ఆర్. శ్రీనివాసులు రెడ్డి, బీటెక్ రవి ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ పోస్టర్లు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి.

సునీత త్వరలో టీడీపీలో చేరబోతోందని కొద్దిరోజులుగా వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారే కావాలని ఈ పనికి పాల్పడ్డారా? లేకపోతే నిజంగానే టీడీపీ శ్రేణులే ఈ పోస్టర్లు అతికించాయా..అన్నది తెలియాల్సి ఉంది. అయితే పోస్టర్లను అర్ధరాత్రి సమయంలో అతికించాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న తలెత్తుతోంది.

First Published:  25 April 2023 9:44 AM GMT
Next Story