Telugu Global
Andhra Pradesh

వైసీపీ దూకుడు.. వెనుకబడ్డ టీడీపీ, జనసేన!

వైఎస్ జగన్ అభ్యర్థుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి కూడా సిద్ధమయినట్లు సమాచారం.

వైసీపీ దూకుడు.. వెనుకబడ్డ టీడీపీ, జనసేన!
X

ఏపీలో రాజకీయ పార్టీలు అప్పుడే ఎన్నికల హడావిడి ప్రారంభించాయి. షెడ్యూల్ ప్రకారం మరో ఏడాదిన్నర టైమ్ ఉన్నా.. నెలలోపే ఎన్నికలన్నంత దూకుడుగా పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ప్రధాన పార్టీల అధినేతలు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే వైసీపీ, టీడీపీ రెండు మూడు సంస్థలతో సర్వేలు చేయించుకొని అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. సీఎం వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. విశాఖ గర్జనను వెనకుండి నడిపించిన పార్టీ.. తాజాగా రాయలసీమ గర్జన చేయనున్నది. అలాగే బీసీల ఆత్మీయ సమ్మేళనం పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించబోతోంది.

వైసీపీ అధినేత, సీఎం జగన్ పార్టీ కార్యక్రమాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు ప్రభుత్వం తరపున పాలన అందిస్తూనే.. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలను ఊరు బాట పట్టించారు. ఒక రకంగా ఈ కార్యక్రమం ఎన్నికల ప్రచారంలాగా సాగుతోంది. ఇప్పటికే వైఎస్ జగన్ అభ్యర్థుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి కూడా సిద్ధమయినట్లు సమాచారం. వెనుబడిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం జగన్ దూకుడు చూస్తే.. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారేమో అన్నంత హడావిడి ఉన్నది.

మరోవైపు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా జిల్లాల్లో తిరుగుతున్నారు. నిన్నటి వరకు బాదుడే బాదుడు కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లిన ఆయన.. తాజాగా ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ పర్యటిస్తున్నారు. కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటనలకు భారీ స్పందన కూడా వచ్చింది. అధికార వైసీపీ పాలనపై విమర్శలు చేస్తూ మైలేజీ పెంచుకునే పనిలో పడ్డారు. జనవరి నుంచి లోకేశ్ పాదయాత్రకు కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సిట్టింగులకు టికెట్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. కీలకమైన 100 నియోజకవర్గాలను ఎంపిక చేసి.. అక్కడి నుంచి ఎవరిని పోటీకి దింపాలనే నిర్ణయం కూడా తీసుకున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

రాబోయే ఎన్నికల్లో జనసేనతో, కలిసి వస్తే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే తాము బరిలో దిగాలనుకుంటున్న 100 సెగ్మెంట్లపై ముందు ఫోకస్ చేశారు. అక్కడి నుంచి బరిలో దిగే అభ్యర్థులపై ఇప్పుడ ఫోకస్ చేసినట్లు తెలుస్తున్నది. మరోవైపు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ రాబిన్ శర్మ కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబుకు సర్వే రిపోర్టులు అందిస్తూ.. పార్టీని ముందుకు నడిపించేందుకు సాయం చేస్తున్నారు.

ఇక ఈ ఎన్నికల హడావిడిలో జనసేన మాత్రం వెనుకబడినట్లు కనిపిస్తున్నది. వీకెండ్ పొలిటిషియన్‌లా మారిన పవన్ కల్యాణ్.. ఆ మధ్య రాష్ట్రంలో హడావిడి చేశారు. కానీ ఇప్పుడు సినిమా షూటింగ్ ఉండటంతో రాష్ట్రం వైపు చూడం లేదు. మీడియా కూడా పవన్ వచ్చినప్పుడే జనసేనపై ఫోకస్ చేస్తుంది. మిగిలిన సమయంలో పార్టీ తరపున ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో కార్యకర్తలకు కూడా సమాచారం ఉండటం లేదు. జనసేన తరపున బరిలోకి దిగడానికి ఇప్పటికీ సరైన అభ్యర్థులు కూడా లేదు. పవన్ కల్యాణ్ ఈ విషయంలో ఇంకా కసరత్తు ప్రారంభించనట్లు సమాచారం.

జనవరి నుంచి బస్సు యాత్ర చేయడానికి పవన్ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అది విడతల వారీగా జరిగే అవకాశం ఉన్నది. తనకు ఇప్పటికే ఉన్న సినిమా కమిట్మెంట్లు పూర్తి చేయాల్సి ఉన్నది. మధ్య మధ్యలో రాజకీయాలు చేయాలి. ఇలా రెండు పడవల మీద కాలు వేసి పవన్ తన రాజకీయం కొనసాగిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే జనసేన మరోసారి చేతులు ఎత్తేయడం ఖాయమని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఒక రకంగా వైసీపీ దూకుడు ముందు మిగిలిన రెండు పార్టీలు వెనుకబడినట్లే అనే చర్చ జరుగుతుంది.

First Published:  4 Dec 2022 1:57 AM GMT
Next Story