Telugu Global
Andhra Pradesh

విశాఖలో వాలిన ఎలక్షన్ పక్షులు

దశాబ్దాలుగా స్థానికేతర నేతలే విశాఖ రాజకీయాలు శాసిస్తుండడంతో కొత్తగా మరికొందరు నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు విశాఖకి తరలివస్తున్నారు.

విశాఖలో వాలిన ఎలక్షన్ పక్షులు
X

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా తేలినీలాపురం ప్రాంతానికి ప్రతీ ఏటా సైబీరియా నుంచి వలస పక్షులు వస్తుంటాయి. వేల కిలోమీటర్ల ప్రయాణించి వచ్చే పెలికాన్, పెయింటెడ్ స్టార్ పక్షులు ఇక్కడే గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి తీసుకెళ్తాయి. వలస పక్షులు మాదిరిగానే ఏపీ నలుమూలల నుంచి ఎలక్షన్ పక్షులు విశాఖకి చేరుకుంటున్నారు. దశాబ్దాల క్రితమే వలస వచ్చిన నేతలు ఇక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకుని పదవులు అనుభవించి, వనరులపై ఆధిపత్యం సాధించి వారే స్థానిక ప్రభువులుగా చెలామణి అవుతున్నారు. వీరి స్ఫూర్తితో కొత్త వలస నేతలు విశాఖలో దిగుతున్నారు.

గత ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ రాయలసీమ ప్రాంతానికి చెందినవారు. విద్యాభ్యాసం వరంగల్, చెన్నైలో సాగింది. మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి. వీఆర్ఎస్ తీసుకున్న లక్ష్మీనారాయణ పొలిటికల్ కెరీర్ లో ఎదుగుదలకి విశాఖని వేదికగా ఎంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ అక్కడి నుంచే పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం బల్లి కురవ మండల పరిధికి చెందిన బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు నరసరావుపేటలో సెటిలయ్యారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యకు ఎంపికైన జీవీఎల్ సాగరతీరం విశాఖనే తన రాజకీయ విహారానికి ఎంచుకున్నారు.

టిడిపిలో ప్రస్తుతం ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు కూడా విశాఖకి వలసవచ్చినవారే. బీజేపీ నుంచి ఎంపీగా పోటీచేసిన కంభంపాటి హరిబాబు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఇటీవల వరకూ పనిచేసిన విజయసాయిరెడ్డిది నెల్లూరు కాగా, తాజా ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డిది ప్రకాశం జిల్లా. విశాఖ కేంద్రంగా రాజకీయాలు నెరిపే ఏ పార్టీ కీలక నేతలు చూసినా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినవారే. దశాబ్దాలుగా స్థానికేతర నేతలే విశాఖ రాజకీయాలు శాసిస్తుండడంతో కొత్తగా మరికొందరు నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు విశాఖకి తరలివస్తున్నారు.

First Published:  13 Dec 2022 3:00 AM GMT
Next Story