Telugu Global
Andhra Pradesh

ఏపీలో జీవో నంబ‌ర్‌-1పై రాజ‌కీయ దుమారం

జీవో నంబ‌ర్‌-1పై ప్ర‌తిప‌క్షాలు మాత్రం తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ప్ర‌తిప‌క్షాలను అణ‌గ‌దొక్కేందుకు ప్ర‌భుత్వం చేస్తున్న కుట్ర అని మండిప‌డుతున్నాయి. ఈ జీవోను త‌క్ష‌ణం ర‌ద్దు చేయాల్సిందేన‌ని టీడీపీ, జ‌న‌సేన పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

ఏపీలో జీవో నంబ‌ర్‌-1పై రాజ‌కీయ దుమారం
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా జారీ చేసిన జీవో నంబ‌ర్-1 ఆ రాష్ట్రంలో రాజ‌కీయ దుమారం రేపుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు స‌భ‌ల నేప‌థ్యంలో కందుకూరు, గుంటూరుల్లో మూడు రోజుల తేడాలో వ‌రుస ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం, కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురు ప్రాణాలు కోల్పోవ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అల‌ర్ట్ అయిన ఏపీ ప్ర‌భుత్వం స‌భ‌ల నిర్వ‌హ‌ణ‌పై నిబంధ‌న‌లు రూపొందిస్తూ ఈ జీవో జారీ చేసింది.

జీవో నంబ‌ర్‌-1పై ప్ర‌తిప‌క్షాలు మాత్రం తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ప్ర‌తిప‌క్షాలను అణ‌గ‌దొక్కేందుకు ప్ర‌భుత్వం చేస్తున్న కుట్ర అని మండిప‌డుతున్నాయి. బ్రిటీష్ కాలం నాటి జీవోల‌తో త‌మ‌ను అడ్డుకోవాల‌ని చూస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ జీవోను త‌క్ష‌ణం ర‌ద్దు చేయాల్సిందేన‌ని టీడీపీ, జ‌న‌సేన పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ జీవోను ప్ర‌జ‌ల ప్రాణర‌క్ష‌ణ కోసం మాత్ర‌మే తెచ్చామ‌ని, ఇందులో ఎలాంటి రాజ‌కీయాలూ లేవ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ జీవో ప్ర‌తిప‌క్షాల‌కు మాత్ర‌మే కాద‌ని, అధికార ప‌క్షానికి కూడా వ‌ర్తిస్తుంద‌ని వివ‌రిస్తోంది.

అస‌లు జీవోలో ఏముందంటే..

జీవో నంబ‌ర్ 1 ప్ర‌కారం.. రాష్ట్ర ర‌హ‌దారులు, పంచాయతీ, మున్సిపాలిటీ రోడ్ల‌పై స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించ‌కూడ‌దు. ఆయా ప్రాంతాల్లో రోడ్లు ఇరుగ్గా ఉంటాయి. ఈ స‌భ‌లు, స‌మావేశాల కోసం అంద‌రూ ఒకేచోటికి రావ‌డం వ‌ల్ల తొక్కిస‌లాట‌లు జ‌ర‌గ‌డానికి అవ‌కాశ‌ముంటుంది. ప్రాణాలు కోల్పోయే ప్ర‌మాదం కూడా ఉంది. ఈ ప్ర‌మాదాల‌ను నివారించేందుకే రోడ్ల‌పై స‌భ‌లు నిర్వ‌హించ‌రాద‌నేది జీవో నంబ‌ర్ 1 సారాంశం. కందుకూరు, గుంటూరు స‌భ‌ల్లో కూడా జ‌రిగింది అదే. అందుకే ఇలాంటి ప్ర‌మాదాల‌ను నివారించ‌డానికి, ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడ‌టానికి త‌క్ష‌ణం స్పందించిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెంట‌నే ఈ జీవోను అమ‌లులోకి తెచ్చింది. ఈ జీవో ప్ర‌తిప‌క్షాల‌కు మాత్ర‌మే కాదు అధికార పార్టీ కూడా వ‌ర్తిస్తుందని రాష్ట్ర మంత్రులు ఇప్ప‌టికే వివ‌ర‌ణ ఇస్తున్నారు.

అయితే ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో స‌భ‌లు నిర్వ‌హించాల‌నుకునేవారు పోలీసుల నుంచి అనుమ‌తులు తీసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఆ స‌భ‌కు ఎంత‌మంది ప్ర‌జ‌లు వ‌స్తారు.. రోడ్డు వెడ‌ల్పు ఎంత ఉంది.. త‌దిత‌ర అంశాల‌ను క్లుప్తంగా వారికి వివ‌రించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా పోలీసులు అక్క‌డి ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించి అనుమ‌తులు ఇస్తార‌నేది జీవో సారాంశం. అనుమ‌తి కోరిన ప్రాంతంలో స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించ‌డం సుర‌క్షితం కాద‌ని భావించినా, అభ్యంత‌రాలున్నా.. పోలీసులే అందుకు ప్ర‌త్యామ్నాయ ప్రాంతాన్ని సూచిస్తారు. జీవో నంబ‌ర్ 1 ప్ర‌కారం ఖాళీ స్థ‌లాల్లో ప‌బ్లిక్ మీటింగులు పెట్టుకోవ‌చ్చు. వాహ‌నాల పార్కింగ్‌, రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు లేకుండా విశాల‌మైన ప్రాంతాల్లో స‌భ‌ల‌కు అనుమ‌తులు ఇస్తామంటోంది ప్ర‌భుత్వం.

రోడ్ షోలు, స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని తమ ఉద్దేశం కాద‌ని, కేవ‌లం ప్ర‌జ‌ల భద్ర‌త‌, వారి ప్రాణ ర‌క్ష‌ణే ల‌క్ష్యంగా ఈ జీవో తీసుకొచ్చామ‌ని అధికార పార్టీ మంత్రులు చెబుతున్నారు. అంతే త‌ప్ప ర్యాలీలు నిర్వ‌హించొద్ద‌ని, ప‌రిమితికి మించి వాహ‌నాలు వెళ్లొద్ద‌ని జీవోలో ఎక్క‌డా పేర్కొన‌లేద‌ని గుర్తుచేస్తున్నారు.

ప్ర‌భుత్వం ఎంత‌లా వివ‌ర‌ణ ఇస్తున్నా.. ప్ర‌తిప‌క్షాలు మాత్రం ఈ జీవోపై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నాయి. టీడీపీ నేత‌లు దీనిని చీక‌టి జీవోగా వ‌ర్ణిస్తున్నారు. కందుకూరు ప్రాంతంలో టీడీపీ నేత‌లు ఈ జీవో ప్ర‌తుల‌ను ద‌హ‌నం చేసి నిర‌స‌న తెలియ‌జేశారు. బ్రిటీష్ కాలం నాటి చ‌ట్టాల‌ని విమ‌ర్శిస్తున్నారు. అయితే 2014-19 మ‌ధ్య కాలంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా ఇలాంటి చ‌ట్టాల‌నే అమ‌లు చేసింద‌నే విష‌యాన్ని అధికార పార్టీ నేత‌లు గుర్తుచేస్తున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లాలో చంద్ర‌బాబు ఇదే పోలీసు చ‌ట్టంలోని సెక్ష‌న్ 30, 31ల‌ను మూడేళ్ల‌పాటు నిర్బంధంగా అమ‌లు చేశార‌ని మాజీ మంత్రి క‌న్న‌బాబు గుర్తు చేస్తున్నారు.

అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌లు వాద‌న‌లు ఇలా ఉంటే.. సామాజిక వేత్త‌లు, న్యాయ‌వాదులు మాత్రం జీవో ప‌ట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు. ర‌హ‌దారులు ప్ర‌జ‌ల రాక‌పోక‌ల‌కు ఆధారంగా ఉండేవ‌ని, అలాంటి మార్గాల‌కు ఆటంకం క‌లిగించే హ‌క్కు ఏ రాజ‌కీయ పార్టీకీ లేద‌ని చెబుతున్నారు. ప్ర‌భుత్వం ర్యాలీలు, బ‌హిరంగ స‌భ‌ల‌పై నియంత్ర‌ణ మాత్ర‌మే విధించింద‌ని, వాటిని ర‌ద్దు చేయ‌లేద‌ని వారు గుర్తుచేస్తున్నారు.

తాజాగా ఆదివారం చంద్ర‌బాబును క‌లిసిన‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ జీవో అంశంపై చ‌ర్చించేందుకే క‌లిసిన‌ట్టు వివ‌ర‌ణ ఇచ్చారు. ముందుముందు ఈ అంశంపై ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయ‌నేది వేచిచూడాలి.

First Published:  9 Jan 2023 5:42 AM GMT
Next Story