Telugu Global
Andhra Pradesh

సంక్రాంతి లక్కీడ్రా.. అంబటిపై కేసు నమోదు

గుంటూరు కోర్టు జోక్యం చేసుకోవడంతో మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రైజ్‌, చిట్స్‌ అండ్‌ మనీ సర్కులేషన్‌ స్కీమ్స్‌ నిషేధ చట్టం కింద అంబటిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంక్రాంతి లక్కీడ్రా.. అంబటిపై కేసు నమోదు
X

అధికార పార్టీ నేత, అందులోనూ మంత్రి.. అయినా కూడా ఆయనపై కేసు పెట్టారు. అయితే ఇది నేరుగా పోలీసులు చేసిన పని కాదు, కోర్టు జోక్యంతో మంత్రి అంబటి రాంబాబుపై కేసు పెట్టాల్సి వచ్చింది. సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫలితం ఎలా ఉంటుందనే విషయం పక్కనపెడితే.. కోర్టు జోక్యంతో మంత్రిపై కేసు నమోదు కావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఆమధ్య వ్యవసాయ శాఖ మంత్ర కాకాణి నిందితుడుగా ఉన్న ఓ కేసులో నెల్లూరు కోర్టులో ఉన్న సాక్ష్యాలను దొంగలెత్తుకుపోయిన వ్యవహారంలో హైకోర్టు జోక్యం చేసుకుంది. కోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే ఆ కేసు సీబీఐకి అప్పగించారు. ఇప్పుడు గుంటూరు కోర్టు జోక్యం చేసుకోవడంతో మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రైజ్‌, చిట్స్‌ అండ్‌ మనీ సర్కులేషన్‌ స్కీమ్స్‌ నిషేధ చట్టం కింద అంబటిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో అంబటి రాంబాబు లాటరీ టికెట్లు అమ్మించారు. లాటరీలో గెలుపొందినవారికి ప్రైజ్ మనీ ఇచ్చారు. ఇదేమీ తప్పు కాదనేది ఆయన వాదన. కానీ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని, ఎవరుపడితే వారు లాటరీలు పెట్టి.. జనం దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని కోర్టు కాస్త కఠినంగానే చెప్పింది. ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని కోర్టు తేల్చి చెప్పిన తర్వాత కూడా లాటరీ విజేతను ప్రకటించడం, వారికి బహుమతి ప్రదానం చకచకా జరిగిపోయాయి. తీరా ఇప్పుడు పోలీసులు కేసు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో సత్తెనపల్లిలో వైసీపీ నేతలు లాటరీ టికెట్లు అమ్ముతున్నారని జనసేన నేతలు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో గుంటూరు కోర్టులో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ విషయమై విచారణ జరిపిన కోర్టు, మంత్రి అంబటిపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

First Published:  18 Jan 2023 2:07 PM GMT
Next Story