Telugu Global
Andhra Pradesh

శ్రీవారికీ నకిలీ బాధ.. 41 వెబ్ సైట్స్ పై కేసులు

సైబర్ సెల్ అధికారులు నకిలీ వెబ్ సైట్ పై విచారణ ప్రారంభించారు. ఇప్పటికే ఇలాంటి 40 నకిలీ వెబ్ సైట్స్ పై పోలీస్ కేసులు నమోదు కాగా ఇది 41వ వెబ్ సైట్ అని టీటీడీ తెలిపింది.

శ్రీవారికీ నకిలీ బాధ.. 41 వెబ్ సైట్స్ పై కేసులు
X

నకిలీ బాధ తిరుమల శ్రీవారిని కూడా వదిలి పెట్టడం లేదు. దేవ దేవుడి పేరు మీద నకిలీ వెబ్ సైట్లు సృష్టించి, భక్తులను తప్పుదోవ పట్టించి విరాళాలు, దర్శనాలు, ప్రసాదాల రూపంలో దండుకుంటున్నారు కొంతమంది కేటుగాళ్లు. దర్శనాలు, ప్రసాదాల విషయంలో ఏర్పాటు చేసిన నకిలీ వెబ్ సైట్ల మాయలో పడితే కాస్త ఆలస్యంగా అయినా మోసపోయామని తెలిసిపోతుంది. కానీ ఇలాంటి వెబ్ సైట్లకు విరాళాలు ఇస్తే అసలు మోసపోయామనే విషయం ఎప్పటికీ తెలియదు. అచ్చంగా అసలు వెబ్ సైట్లను పోలినట్టే ఈ నకిలీ వెబ్ సైట్లు కూడా ఉండటం విశేషం. ఇప్పటికే 40నకిలీ వెబ్ సైట్లపై పోలీస్ కేసులు నమోదు కాదా, తాజాగా మరో వెబ్ సైట్ గురించి తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది టీటీడీ.

అసలు సైట్ ఇది: https://tirupatibalaji.ap.gov.in/

నకిలీ సైట్ ఇది: https://tirupatibalaji-ap-gov.org/

అసలు వెబ్ సైట్ లో .(డాట్) ఉన్న చోట '-' ని చేర్చి నకిలీ వెబ్ సైట్ సృష్టించారు. దీంట్లో కూడా అసలు వెబ్ సైట్ లాగే లాగిన్ డిటెయిల్స్ అడుగుతారు. ఆ తర్వాత దర్శనం టికెట్ల వివరాలు, ఆన్ లైన్ లో నగదు చెల్లించడం, అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. పొరపాటున ఇందులో టికెట్లు బుక్ చేసుకుంటే కొండకు వెళ్లకుండానే గోవిందా-గోవిందా అనుకున్నట్టే.

ఇలాంటి నకిలీ వెబ్ సైట్ల మాయలో పడొద్దని భక్తులను హెచ్చరించింది టీటీడీ. వెంటనే ఈ నకిలీ వెబ్ సైట్ నిర్వాహకులను కనిపెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీడీ అధికారులు. ఎఫ్ఐఆర్ 19/2023 యు/ఎస్ 420, 468, 471 ఐపీసీ సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి ఏపీ ఫోరెన్సిక్ సైబర్ సెల్ కు అప్పగించారు. సైబర్ సెల్ అధికారులు నకిలీ వెబ్ సైట్ పై విచారణ ప్రారంభించారు. ఇప్పటికే ఇలాంటి 40 నకిలీ వెబ్ సైట్స్ పై పోలీస్ కేసులు నమోదు కాగా ఇది 41వ వెబ్ సైట్ అని టీటీడీ తెలిపింది.

First Published:  23 April 2023 4:11 PM GMT
Next Story