Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు ఏ-1.. మొత్తం వెయ్యిమందిపై కేసులు

అనుమతి లేకపోయినా సభ నిర్వహించారని ఐజీ పాలరాజు తెలిపారు. పోలీసు యాక్టు-30 అమలులో ఉందని చెప్పినా కూడా చంద్రబాబు వినలేదని అన్నారాయన.

చంద్రబాబు ఏ-1.. మొత్తం వెయ్యిమందిపై కేసులు
X

అనపర్తి దేవీచౌక్‌ సెంటర్ లో అనుమతి లేకపోయినా రోడ్డుపై సభ నిర్వహించినందుకు గాను చంద్రబాబు సహా మొత్తం వెయ్యిమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదు మేరకు 143, 353, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనపర్తి, బిక్కవోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 5 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. పోలీసులు అనుమతి లేదని అడ్డుకుంటున్నా కూడా వారిని వారించి, పక్కకు తప్పించి చంద్రబాబు కాలినడకన దేవీచౌక్ సెంటర్ కి చేరుకుని సభ నిర్వహించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

చంద్రబాబు ఏ1గా, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జవహర్‌ ఏ3గా బిక్కవోలు పోలీసులు కేసులు నమోదు చేశారు. స్వామినాయుడు, చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే కొండబాబు, గొల్లపల్లి సూర్యారావు, జ్యోతుల నవీన్ పై కూడా కేసులు పెట్టారు. అనుమతి లేకపోయినా సభ నిర్వహించారని ఐజీ పాలరాజు తెలిపారు. అనపర్తిలో రోడ్డుపై చంద్రబాబు సభ నిర్వహించడానికి వీల్లేదని ముందే చెప్పామని, ప్రత్యామ్నాయంగా రెండు వేదికలు కూడా చూపించామన్నారాయన. పార్టీ నేతలతో మాట్లాడి చెబుతామని సమాచారం ఇచ్చి, చివరకు రోడ్డుపైనే సభ నిర్వహించారని ఆరోపించారు. పోలీసు యాక్టు-30 అమలులో ఉందని చెప్పినా కూడా చంద్రబాబు వినలేదని అన్నారాయన. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి సభలు పెట్టుకునే హక్కు ఉందని, దాన్ని ఆపే అధికారం ఎవరికీలేదని, అయితే రోడ్డుపై సభలకు అనుమతించే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు ఐజీ. రోడ్డుపైనే సభలు నిర్వహిస్తామంటే చట్టం తనపని తాను చేస్తుందని అన్నారు.

కేసులకు భయపడేది లేదు..

వాస్తవానికి టీడీపీకి కావాల్సింది కూడా ఇదే అన్నట్టుగా ఉంది. అప్పట్లో జగన్ యాత్రను, సభలకు తాము అడ్డు చెప్పలేదని, కానీ ఇప్పుడు కక్షకట్టి తమను రోడ్డుపైకి రానీయకుండా చేస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులతో కేసులు పెట్టించి, అరెస్ట్ లు చేయిస్తున్నారంటూ సింపతీకోసం ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా నమోదైన కేసులపై టీడీపీ తీవ్రంగా స్పందించింది.

First Published:  18 Feb 2023 3:10 PM GMT
Next Story