Telugu Global
Andhra Pradesh

పోలవరం ఖర్చు.. రూ.2022 కోట్లు ఇలా పెరిగింది

ఆ నాలుగు ప్రాంతాల్లో కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి, దాన్ని పాతదానికి అనుసంధానించాలన్నారు నిపుణులు. ఈ పనులకు మొత్తం రూ.2022.05 కోట్లు వ్యయం అవుతుందని తేల్చారు. ఈ మరమ్మతు పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది.

పోలవరం ఖర్చు.. రూ.2022 కోట్లు ఇలా పెరిగింది
X

పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా గత వరదల సమయంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదనేది వైసీపీ ప్రధాన ఆరోపణ. అందుకే ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అవుతోందని పదే పదే చెబుతున్నారు మంత్రులు, నేతలు. ఈ క్రమంలో పోలవరంకి డెడ్ లైన్లు పెట్టడం కూడా ఆపేశారు. తాజాగా డయాఫ్రమ్ వాల్ కి సమాంతరంగా మరో గోడ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం 2022.05 కోట్ల రూపాయలకు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. వరదలకు పోలవ­రం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌ వద్ద ఏర్పడిన నాలుగు భారీ అగాధాలు పూడ్చడం, దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ కు సమాంతరంగా మరో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించి పటిష్టం చేయడం కోసం ఈ నిధులు కేటాయిస్తున్నారు.

ఇటీవల పోలవరం ప్రాజెక్ట్ విషయంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని సరిచేసేందుకు నిపుణులతో 15రోజులపాటు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. నిపుణుల బృందం పోల­వ­రం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించి, చేప­ట్టాల్సి­న పనులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. అక్కడ ఏర్పడిన అగాధాలను ఇసుకతో పూడ్చి వయబ్రో కాంపాక్షన్‌ చేయాలని సూచించింది. డయాఫ్రమ్ వాల్ 4చోట్ల దెబ్బతిన్నదని తేల్చారు నిపుణులు. ఆ నాలుగు ప్రాంతాల్లో కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి, దాన్ని పాతదానికి అనుసంధానించాలన్నారు. ఈ పనులకు మొత్తం రూ.2022.05 కోట్లు వ్యయం అవుతుందని తేల్చారు. ఈ మరమ్మతు పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది.

2019లో గోదావరికి వచ్చిన భారీ వరదల కారణంగా.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలోని కాఫర్ డ్యామ్ ప్రాంతంలో ఇసుక మేట వేసింది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. నాలుగు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రాజెక్ట్ నిర్మాణం కాస్త ఆలస్యమైంది. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ పర్యటనల తర్వాత పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మరమ్మతుల పనులకు సంబంధించిన క్లారిటీ వచ్చింది. అదనపు వ్యయాన్ని కూడా కేంద్రం భరిస్తానని చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. గోదావరికి వరదలు వచ్చేలోగా ప్రధాన డ్యామ్‌ వద్ద ఏర్పడిన భారీ అగాధాలను పూడ్చివేసి, డయాఫ్రమ్‌ వాల్‌ ను పటిష్టం చేసే పనులను పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ ఆదేశించారు. దీంతో తక్షణమే ఆ పనులు చేపట్టడానికి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు నిర్ణయించారు. నిబంధనల మేరకు టెండర్ల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

First Published:  11 April 2023 9:00 AM GMT
Next Story