Telugu Global
Andhra Pradesh

ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. ఎప్పుడంటే..?

అదేరోజు ఏపీలో పార్టీ కార్యాలయం కూడా కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తారనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈలోగా పార్టీ సభ్యత్వాలు చేపట్టాలని, గ్రామ, మండల, జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడికి సూచించారు కేసీఆర్.

ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. ఎప్పుడంటే..?
X

భారత్ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ తో హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఏపీలో పార్టీ విస్తరణపై వారిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభపై వారు సమాలోచనలు చేశారు. ఏపీ బీఆర్ఎస్ నేత చింతల పార్థసారథి కూడా వీరితో ఉన్నారు. త్వరలో వేదిక, తేదీ ప్రకటిస్తారు. ఈ ఆవిర్భావ సభలో భారీగా చేరికలుంటాయని మాత్రం తెలుస్తోంది. ఈలోగా చేరికల వ్యవహారాన్ని తోట చంద్రశేఖర్ ఫైనల్ చేస్తారు. ఆ తర్వాత కేసీఆర్ ఆమోదంతో చేరికలు ఉంటాయి.

ఎప్పుడు, ఎక్కడ..?

సంక్రాంతి తర్వాత చేరికలు ఊపందుకుంటాయని గతంలో కేసీఆర్ చెప్పారు, ఆవిర్భావ సభ కూడా సంక్రాంతి తర్వాతే ఏర్పాటు చేసే అవకాశముంది. అదేరోజు ఏపీలో పార్టీ కార్యాలయం కూడా కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తారనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈలోగా పార్టీ సభ్యత్వాలు చేపట్టాలని, గ్రామ, మండల, జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడికి సూచించారు కేసీఆర్.

ఏపీలో వణుకు..

ఏపీలోని కీలక నేతలు వెళ్లి హైదరాబాద్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరినందుకే ఇక్కడి నాయకులు తెగ ఇదైపోయారు. ఇప్పుడు నేరుగా కేసీఆర్ ఏపీకి వస్తున్నారనే వార్తలతో మరింత హడావిడి మొదలైంది. ఏపీలో బీఆర్ఎస్ సభకు ఎలాంటి ఆదరణ వస్తుంది, ఎవరెవరు కండువాలు కప్పుకుంటారు, ఏ స్థాయి నాయకులు బీఆర్ఎస్ లో చేరతారు అనే విషయంలో ఇతర పార్టీల నేతలు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి తీవ్ర స్థాయిలో ఎదురుదాడి మొదలైంది. ఏపీలో బీఆర్ఎస్ ని ఎవరూ నమ్మరని చెబుతున్నారు వైసీపీ నేతలు. మరోవైపు వైసీపీ, బీఆర్ఎస్ కలసి తమ నాయకులను ప్రలోభ పెడుతున్నాయని బీజేపీ నుంచి విమర్శలు వినపడుతున్నాయి. టీడీపీ, జనసేన మాత్రం సైలెంట్ గా ఉన్నాయి. ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ, చేరికలతో ఇక్కడ మరింత అలజడి రేగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

First Published:  5 Jan 2023 12:45 AM GMT
Next Story