Telugu Global
Andhra Pradesh

41 మంది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా?

కోటంరెడ్డి ఆరోపణల్లో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ పార్టీలో ఇదొక సంచలనంగా మారింది. అయితే చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కోటంరెడ్డి ఆరోపణలను కొట్టిపడేశారు.

41 మంది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా?
X

రాష్ట్రంలో ఇప్పుడు లేటెస్టు సెన్సేషన్ టాపిక్ ఏమిటంటే మొబైల్ ట్యాపింగే. ట్యాపింగ్ తేనెతుట్టె కదలటానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డే కారణం. తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని మీడియా సమావేశంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే అందుకు చూపించిన ఆధారం అంత కన్వీన్సింగ్‌గా లేదు. ఎమ్మెల్యే ఫోన్‌ను ట్యాపింగ్ చేసిన ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు ట్యాపింగ్ చేస్తున్న విషయాన్ని సదరు ఎమ్మెల్యేకి ఎందుకు చెబుతారు?

ట్యాపింగ్ అంటేనే రహస్యంగా జరిగేదని అర్థం. అలాంటిది రహస్యంగా జరిగే విషయాన్ని స్వయంగా ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులే ఎమ్మెల్యేకి ఎందుకు చెబుతారు? ఇక్కడే కోటంరెడ్డి ట్యాపింగ్ ఆరోపణలపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. అనేక కారణాల వల్ల ఎమ్మెల్యే టీడీపీకి దగ్గరవుతున్నారన్నది మాత్రం నిజం. గతంలో న్యాయస్థానం టు దేవస్ధానం పేరుతో అమరావతి జేఏసీ నాయకత్వంలో పాదయాత్ర జరిగిన విషయం తెలిసిందే. ఆ పాదయాత్ర నెల్లూరు రూరల్ నియోజకవర్గం మీద వెళ్ళినపుడు వాళ్ళకు భోజన, వసతి ఏర్పాట్లు చేసింది కోటంరెడ్డే.

అప్పటి నుండే కోటంరెడ్డి వైఖరిని పార్టీ నాయకత్వం జాగ్రత్తగా గమనిస్తోందని సమాచారం. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే కోటంరెడ్డి ఆరోపణల ప్రకారం ఇద్దరు మంత్రులు, 35 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి. ట్యాపింగ్ ఆరోపణలు చేయగానే చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు తనతో మాట్లాడుతూ.. తమ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని చెప్పినట్లు కోటంరెడ్డి చెప్పారు. అయితే వాళ్ళెవరో మాత్రం చెప్పలేదు. పార్టీ నుండి బయటకు వెళ్ళిపోదలచుకున్న ఎమ్మెల్యే మరి వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేదో?

కోటంరెడ్డి ఆరోపణల్లో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ పార్టీలో ఇదొక సంచలనంగా మారింది. అయితే చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కోటంరెడ్డి ఆరోపణలను కొట్టిపడేశారు. తమ ఫోన్లు ట్యాప్ అవటంలేదంటూ ప్రకటిస్తున్నారు. పేర్ని నాని మాట్లాడుతూ.. తన ఫోన్‌ను ట్యాప్ చేస్తే నష్టం ఏముందన్నారు. ఎలాంటి చీకటి పనులు, ఒప్పందాలు చేసుకోనప్పుడు ఫోన్ ట్యాప్ అయితే మాత్రం భయమెందుకుంటుందని ఎదురుదాడి చేశారు. మొత్తానికి ట్యాపింగ్ అంశం పెద్ద సంచలనంగా మారింది.

First Published:  2 Feb 2023 5:48 AM GMT
Next Story