Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు అవసరాల కోసం పుట్టిన టెంట్ హౌజ్ పార్టీ జనసేన.. పేర్ని నాని ఫైర్

సీఎం పదవిని డిమాండ్ చేసేంత బలం జనసేనకు లేదని పరోక్షంగా పవన్ కళ్యాణ్ అంటున్నారని, ఈ విషయం ఆయనకు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా? అని నాని ప్రశ్నించారు.

చంద్రబాబు అవసరాల కోసం పుట్టిన టెంట్ హౌజ్ పార్టీ జనసేన.. పేర్ని నాని ఫైర్
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను విమర్శించడంలో ఎప్పుడూ ముందుండే మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని మరోసారి పవన్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు అవసరాల కోసం పుట్టిన టెంట్ హౌజ్ పార్టీ జనసేన అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొత్తుల గురించి తాజాగా పవన్ కళ్యాణ్ ఓపెన్‌గా మాట్లాడిన సంగతి తెలిసిందే. సింగిల్‌గా పోటీ చేసి జనసేన పార్టీని బలివ్వలేనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కనీసం 30 స్థానాలు కూడా గెలవలేకపోయామని..సీఎం పదవి కావాలని ఎలా డిమాండ్ చేస్తామన్నారు. ఇక పది స్థానాలు కూడా రాకుంటే ఏం చేయలేమని పవన్ వ్యాఖ్యానించారు.

పొత్తుల గురించి మాట్లాడుతూ.. పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయాలు చంద్రబాబు కోసమే నడుస్తున్నాయని ఆరోపించారు. సీఎం పదవిని డిమాండ్ చేసేంత బలం జనసేనకు లేదని పరోక్షంగా పవన్ కళ్యాణ్ అంటున్నారని, ఈ విషయం ఆయనకు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా? అని నాని ప్రశ్నించారు.

జనసేన పార్టీని ఏర్పాటు చేసిన సమయంలోనే ఆ పార్టీకి బలం లేదని పవన్‌కు తెలుసన్నారు. తమ పార్టీకి బలం లేదు కాబట్టే 2014లో పోటీ చేయలేదని పవనే స్వయంగా ప్రకటించారని చెప్పారు. ఇక 2019లో చంద్రబాబుకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఆ ఓట్లు జగన్‌కు పడకుండా చీల్చడానికే జనసేన పోటీ చేసిందని ఆరోపించారు.

ఓట్ల కోసం రాజకీయాలు చేయడం పవన్ కళ్యాణ్‌కే సాధ్యమైందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని నమ్మి ఆయన వెంట జనసైనికులు తిరుగుతున్నారని నాని చెప్పారు. ఇప్పటికైనా వారు తమ త్యాగాలను మానుకొని తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని ఆయన సూచించారు.

First Published:  12 May 2023 3:29 PM GMT
Next Story