Telugu Global
Andhra Pradesh

దశాబ్ది ఉత్సవాల వేళ.. వైసీపీ సమైక్యవాదం

ఆంధ్రప్రదేశ్ అవతరణ నవంబర్-1 మాత్రమే అని అన్నారు పేర్ని నాని. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేది వైసీపీ స్టాండ్ అని చెప్పారు.

దశాబ్ది ఉత్సవాల వేళ.. వైసీపీ సమైక్యవాదం
X

రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. అయినా ఇంకా ఏపీలో రాజకీయ పార్టీలు విభజన వ్యవహారంలో రాజకీయాలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా చంద్రబాబు తెలంగాణ ప్రజలకు దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇక్కడ వైసీపీ ఓ లాజిక్ వెదికింది. రాష్ట్ర విభజన జరిగి ఏపీ నష్టపోతే అందుకు తెలంగాణ ప్రజలకు చంద్రబాబు ఎలా శుభాకాంక్షలు తెలుపుతారని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా శుభాకాంక్షలు చెప్పారా అని అడిగారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ నవంబర్-1 మాత్రమే అని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేది వైసీపీ స్టాండ్ అని చెప్పారు.

తొమ్మిదేళ్ల తర్వాత ఇంకా స్టాండేంటి..?

విభజన జరిగి తొమ్మిదేళ్లు పూర్తయినా ఇంకా వైసీపీ స్టాండ్ సమైక్య రాష్ట్రం అంటే ఎలా..? ఉద్యమ సమయంలో తమది సమైక్యవాదం అన్నారంటే దానికో అర్థముంది, ఇప్పుడు కూడా సమైక్య రాష్ట్రం అంటూ వైసీపీ స్టాండ్ తీసుకుంటే.. ఆ దిశగా వారు ప్రయత్నాలు సాగిస్తున్నారని అనుకోవాలా..? అంటే విభజనతో ఏపీ నష్టపోయిందనుకుంటే, ఆ నష్టాన్ని పూడ్చడానికి మళ్లీ రాష్ట్రాన్ని కలిపేయాలనుకుంటున్నారా..? ఇది కేవలం పేర్ని నాని స్టాండేనా, లేక వైసీపీ స్టాండ్ కూడానా..? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

2047 కి పేదల్ని కోటీశ్వరులను చేస్తానని చంద్రబాబు చెబుతున్నారని, అప్పటికి బాబు వయసు ఎంత ఉంటుందని పేర్నినాని ప్రశ్నించారు. విజన్ 2020 పోయి విజన్ 2047 వచ్చిందని, అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఆయన ఏదీ చెయ్యడని కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ గుంటూరు మధ్య రాజధానిని చంద్రబాబు నిర్మించి ఉండొచ్చు కదా అని ప్రశ్నించారు.

అది వారాహి యాత్ర కాదు, చంద్రయాత్ర..

పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై కూడా పేర్ని నాని సెటైర్లు పేల్చారు. పవన్ ది టూర్ ప్యాకేజీనా అంటూ ప్రశ్నించారు. పవన్ తన యాత్రకు అన్నవరం, భీమవరం అని కాకుండా చంద్రవరం అని పేరు పెట్టాల్సిందని అన్నారు. చంద్రబాబును పొగడటమే పవన్ కల్యాణ్ పని అని చెప్పారు. వారాహిని తెలంగాణలో దాచి పెట్టారా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు గోదావరి జిల్లాల్లో తిరగమని చెప్పి ఉంటాడని, ఆ ప్రాంతమైతే.. లోకేష్ యాత్రకు అడ్డు రాదు కదా అని అన్నారు.

First Published:  2 Jun 2023 2:46 PM GMT
Next Story