Telugu Global
Andhra Pradesh

దీనికే చంకలు గుద్దుకోవాలా..? పేర్ని నాని కౌంటర్లు

పేర్ని నాని టీడీపీపై మండిపడ్డారు. ఒకటి రెండు స్థానాల్లో గెలిస్తేనే చంకలు గుద్దుకోవాలా అని ప్రశ్నించారాయన.

AP MLC Election Results 2023: దీనికే చంకలు గుద్దుకోవాలా..? పేర్ని నాని కౌంటర్లు
X

పేర్ని నాని 

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీదే పైచేయి. కాదనేవారు ఎవరూ లేరు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో అన్నీ వైసీపీకే. ఇక ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఉన్న రెండు సీట్లూ వైసీపీకే సొంతమయ్యాయి. పట్టభద్రుల స్థానాలు మాత్రం ఆ పార్టీకి చుక్కలు చూపెడుతున్నాయి. రెండు టీడీపీ ఖాతాలో పడగా, మూడోస్థానంలో హోరా హోరీ నడుస్తోంది. దీంతో టీడీపీ సంబరాల్లో మునిగిపోయింది.


వైసీపీ పనైపోయిందని, తిరుగుబాటు మొదలైందని, మార్పు కనపడుతోందని టీడీపీ నేతలు అంటున్నారు. వైసీపీ అదే స్థాయిలో కౌంటర్లు ఇవ్వలేకపోయినా ఒకరిద్దరు మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తున్నారు. పేర్ని నాని టీడీపీపై మండిపడ్డారు. ఒకటి రెండు స్థానాల్లో గెలిస్తేనే చంకలు గుద్దుకోవాలా అని ప్రశ్నించారాయన.

గతంలో వైసీపీ ఎప్పుడూ ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల్లో పోటీ చేయలేదని, తొలిసారి పోటీ చేసి రెండు ఉపాధ్యాయ స్థానాలు గెలుచుకుందని, పట్టభద్రుల స్థానాల్లో ఫలితాలు వేరుగా వస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత అనుకోవడం తప్పు అని చెప్పారాయన. టీడీపీ అల్ప సంతోషాన్ని తాము కాదనలేమని అన్నారు.

టీడీపీ వెర్షన్ వేరేలా ఉంది. విశాఖకు రాజధాని అని ఊదరగొట్టినా, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ మభ్యపెట్టినా.. ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఏమాత్రం కల్లబొల్లి మాటలు వినలేదని, అందుకే టీడీపీకి మద్దతిచ్చారని అంటున్నారు నేతలు. ఏపీలో మార్పు మొదలైందని అంటున్నారు. కానీ వైసీపీ ఓటమిని ఒప్పుకోవడంలేదు. రెండు స్థానాల్లో ఓడిపోయినంత మాత్రాన తమకు తగ్గేది లేదని, టీడీపీకి పెరిగేది లేదని చెబుతున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అసలు పోటీయే చేయని స్థానాల్లో తాము ఖాతా తెరిచామని అంటున్నారు. టీడీపీ గెలిచిన చోట్ల ఆ పార్టీకి బలం లేదని, కేవలం అభ్యర్థుల సొంత బలంతోనే గెలిచారని చెప్పారు.

First Published:  18 March 2023 2:25 AM GMT
Next Story