Telugu Global
Andhra Pradesh

పవన్ కి అంత సీన్ లేదు.. గుట్టు విప్పిన పేర్ని నాని

పవన్ కి దమ్ముంటే వైజాగ్, విజయవాడ, కాకినాడ, తిరుపతి వంటి ప్రాంతాల్లో అభ్యర్థుల్ని ప్రకటించాలని, ఆయా నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పాలని డిమాండ్ చేశారు పేర్ని నాని.

పవన్ కి అంత సీన్ లేదు.. గుట్టు విప్పిన పేర్ని నాని
X

ఏపీ రాజకీయాల్లో ఈరోజు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన కచ్చితంగా పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ఏకపక్షంగా ప్రకటించారు. తనపై ఒత్తిడి ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. దీంతో జనసేన వర్గాలు కొంతవరకు హ్యాపీ. టీడీపీని కాదని పవన్ సొంత నిర్ణయం తీసుకున్నారని, చంద్రబాబు నిర్ణయాలన్నిటికీ పవన్ తలూపడం లేదని వారు అనుకుంటున్నారు. అయితే ఇదంతా వట్టి డ్రామా అని కొట్టిపారేశారు మాజీ మంత్రి పేర్ని నాని. జనసైనికులు అలా అనుకోవాలనే, తాను బెట్టు చేస్తున్నట్టు బయటకు చెప్పుకోవాలనే పవన్ కల్యాణ్ ఆ రెండు నియోజకవర్గాల పేర్లు ప్రకటించారన్నారు. ఆ మాటకొస్తే అవి పవన్ లాక్కున్నవి కావని, టీడీపీ విదిల్చినవేనని క్లారిటీ ఇచ్చారు.

ప్రీ ప్లాన్డ్ డ్రామా..

టీడీపీతోనే తన ప్రయాణం అని చెప్పిన పవన్ కల్యాణ్ సడన్ గా.. రెండు నియోజకవర్గాల పేర్లు చెప్పడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని, సొంతగా రెండు నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించారని, తాను కూడా అలాగే చేస్తున్నానని పవన్ చెప్పారు. రాజోలు, రాజా నగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందన్నారు. కానీ పేర్ని నాని.. ఈ వ్యవహారం గుట్టు విప్పారు. గడచిన నాలుగున్నరేళ్లుగా రాజానగరం, రాజోలు నియోజకవర్గాలకు టీడీపీ ఇన్ చార్జ్ లను నియమించలేదని, ఆ రెండు నియోజకవర్గాలను చంద్రబాబు.. జనసేనకే వదిలేశారని గుర్తు చేశారు. అంటే చంద్రబాబు జనసేనకు కేటాయించిన సీట్లనే పవన్ కల్యాణ్‌ ఈ రోజు ప్రకటించారన్నమాట.

తనపై జనసైనికుల్లో, పార్టీ నేతల్లో వస్తున్న వ్యతిరేకత చల్లార్చేందుకే పవన్ కల్యాణ్ అభ్యర్థుల ప్రకటన పేరుతో డ్రామా ఆడారంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని. తనని తిడుతున్న పార్టీ కార్యకర్తలను జోకొట్టడానికే పవన్ ఈ స్కెచ్ వేశారన్నారు. నిజంగా పవన్ కల్యాణ్‌ కు పౌరుషం ఉంటే.. ఆయన కీలక స్థానాలను ప్రకటించే వాడన్నారు. దమ్ముంటే వైజాగ్, విజయవాడ, కాకినాడ, తిరుపతి వంటి ప్రాంతాల్లో అభ్యర్థుల్ని ప్రకటించాలని, ఆయా నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పాలని డిమాండ్ చేశారు పేర్ని నాని. పేర్ని వ్యాఖ్యలకు జనసేన నుంచి ఎలాంటి కౌంటర్లు ఉంటాయో వేచి చూడాలి.

First Published:  26 Jan 2024 12:50 PM GMT
Next Story