Telugu Global
Andhra Pradesh

గిల్లితే గిల్లిచ్చుకోం.. తిరిగి గిల్లుతాం -పేర్ని నాని

సంక్రాంతికి మంత్రి అంబటి డ్యాన్స్ చేసేటప్పుడు వేసుకున్న డ్రస్సుని యాజిటీజ్ గా ఇక్కడ ఆ పాత్రధారితో వేయించారని, సందర్భం లేకుండా ఆ పాత్రని తిట్టించారని, ఇది గిల్లడమే కదా అన్నారు. అలా గిల్లితే తాము కూడా గిల్లుతామని, సైలెంట్ గా ఉండలేమన్నారు నాని.

గిల్లితే గిల్లిచ్చుకోం.. తిరిగి గిల్లుతాం -పేర్ని నాని
X

మేం గిల్లితే గిల్లిచ్చుకోవాలి అంతే..! అంటే అది సినిమాలకే చెల్లుతుందని, నిజ జీవితంలో గిల్లితే తిరిగి గిల్లుతామని హెచ్చరించారు మాజీ మంత్రి పేర్ని నాని. 'పిచ్చుకపై బ్రహ్మాస్త్రం' అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకి పేర్ని తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ గురించి ఊరికే చర్చ రాలేదని, సినిమాల్లో అనవసరంగా వెటకారం చేసే పాత్రని పెట్టి దురద తీర్చుకోవాలి అనుకున్నారు కాబట్టే ఆ చర్చ మొదలైందన్నారు. అయినా చిరంజీవి రెమ్యునరేషన్ ఎవరూ అడగలేదు కదా అని లాజిక్ తీశారు నాని.

చిరంజీవి అంటే తనకు అభిమానం ఉందని, ఆయన సినిమాలు వస్తే తాను కూడా దండలు వేస్తానని, వాల్తేరు వీరయ్య 200 రోజులు ఆడటం సంతోషంగా ఉందని చెబుతూనే.. చిరంజీవికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నుంచి, ఏపీ సచివాలయానికి ఎంత దూరం ఉంటుందో.. ఏపీ సచివాలయం నుంచి కూడా ఫిల్మ్ నగర్ కు అంతే దూరం ఉంటుందని చెప్పారు నాని. ఆ విషయం పెద్దలు గ్రహించాలని చురకలంటించారు.

రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే అని తేల్చి చెప్పారు నాని. ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే ఇలాగే ఉంటుందన్నారు. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్, రవితేజ, చిరంజీవి మేనళ్లుళ్లు.. ఇలా మిగతా హీరోల గురించి ఎవరూ మాట్లాడలేదని, కేవలం ఆ సినిమా గురించే మాట్లాడుతున్నారంటే, అందులో మంత్రిని అవమానించే సన్నివేశాలు పెట్టారు కాబట్టే అని చెప్పారు నాని. మాతృకలో లేని పాత్ర, తెలుగులోకి వచ్చే సరికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అందులోనూ సంక్రాంతికి మంత్రి అంబటి డ్యాన్స్ చేసేటప్పుడు వేసుకున్న డ్రస్సుని యాజిటీజ్ గా ఇక్కడ ఆ పాత్రధారితో వేయించారని, సందర్భం లేకుండా ఆ పాత్రని తిట్టించారని, ఇది గిల్లడమే కదా అన్నారు. అలా గిల్లితే తాము కూడా గిల్లుతామని, సైలెంట్ గా ఉండలేమన్నారు నాని.

First Published:  8 Aug 2023 10:49 AM GMT
Next Story