Telugu Global
Andhra Pradesh

ఆడలేక మద్దెల ఓడు.. బీఆర్ఎస్ పై పేర్ని నాని అక్కసు

పాతిక ఎంపీ సీట్లు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తాం, ప్రత్యేక హోదా సాధిస్తామంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీ నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ పై విమర్శలు చేయడం నిజంగా విచిత్రమే. మోదీ, అమిత్ షా ఎప్పుడొస్తారోనని తెలంగాణ మంత్రులు భయంతో ఉన్నారంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనం.

ఆడలేక మద్దెల ఓడు.. బీఆర్ఎస్ పై పేర్ని నాని అక్కసు
X

ఆడలేక మద్దెల ఓడు అంటే ఇదేనేమో. ఏపీకి తెలంగాణ నేతలు ద్రోహం చేశారంటూ పేర్ని నాని కొత్త పల్లవి అందుకున్నారు. బీఆర్ఎస్ నేతలపై ఏపీ ప్రజలకు కోపం ఉందంటూ ఉదయం కొడాలి నాని కౌంటర్లు ఇవ్వగా, సాయంత్రానికి మరో మాజీ మంత్రి పేర్ని నాని లైన్లోకి వచ్చారు. తెలంగాణ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రులు ఏపీని ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ల నుంచి దొంగ కరెంట్ తీసుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో పోటీ చేయడంలో తప్పు లేదని.. కేఏ పాల్ కూడా 175 స్థానాల్లో పోటీ చేశాడని ఎద్దేవా చేశారు.

ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది ఎవరు..?

పాతిక ఎంపీ సీట్లు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తాం, ప్రత్యేక హోదా సాధిస్తామంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీ నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ పై విమర్శలు చేయడం నిజంగా విచిత్రమే. మోదీ, అమిత్ షా ఎప్పుడొస్తారోనని తెలంగాణ మంత్రులు భయంతో ఉన్నారంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనం. ఏపీకి ద్రోహం చేసింది తెలంగాణ నేతలేనని, ఏపీని తెలంగాణ నేతలే వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపణలు చేశారు నాని. మోదీ, అమిత్ షా కి ఎదురొడ్డి దొంగ కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ, ఎమ్మెల్యేలను వారి ఎరకు చిక్కకుండా కాపాడుకుంటోంది బీఆర్ఎస్. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం ఏపీ బీజేపీ నేతలకంటే ఎక్కువగా మోదీ, అమిత్ షా భజనలో మునిగిపోయింది. కేంద్రం నుంచి ఎవరొస్తున్నా.. ఆహ్వానం పలకడంలో స్థానిక బీజేపీ నేతలకు కూడా వైసీపీ అవకాశం ఇవ్వడంలేదంటే వారి మర్యాద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆత్మ గౌరవాన్ని ఏ స్థాయిలో పణంగా పెట్టారో తెలుసుకోవచ్చు.

కేంద్రాన్ని నిలదీయలేక..

ఏపీకి చెందిన ఆస్తులు పంచారా? డబ్బులిచ్చారా? విద్యుత్ బకాయిలు చెల్లించారా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్న మాజీ మంత్రి పేర్ని నాని.. కేంద్రం వద్ద ఈ డిమాండ్లు ఎందుకు వినిపించరో సమాధానం చెప్పాలి. పోతిరెడ్డిపాడు విషయంలో వైసీపీ చేసిందేంటి..? శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వహణలో ఏపీ అత్యుత్సాహానికి కారణం ఎవరు..? వీటన్నిటినీ పక్కనపెట్టి ఇప్పుడు నాని, బీఆర్ఎస్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదం అంటున్నారు తెలంగాణ నేతలు.

First Published:  2 Jan 2023 5:05 PM GMT
Next Story