Telugu Global
Andhra Pradesh

నిజం గెలవాలనే జనం కోరుకుంటున్నారు.. టీడీపీపై అంబటి సెటైర్స్‌

చంద్రబాబు జైలుకు వెళ్లాక ఎన్టీఆర్, హరికృష్ణ, వంగవీటి రంగా, కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిస‌లాట‌ల్లో చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తున్నాయన్నారు.

నిజం గెలవాలనే జనం కోరుకుంటున్నారు.. టీడీపీపై అంబటి సెటైర్స్‌
X

‘నిజం గెలవాలి’ అనే పేరుతో నారా భువనేశ్వరి యాత్ర చేపడతామని చేసిన ప్రకటనపై మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జనం కూడా నిజంగా నిజం గెలవాలనే కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. తాడేపల్లిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నిజాలను పాతాళంలోకి తొక్కేశారని, వ్యవస్థలను మ్యానేజ్‌ చేసేవారన్నారు. ఇప్పుడు నిజం గెలుస్తున్నందునే చంద్రబాబు జైల్లో ఉన్నారని మంత్రి అంబటి తెలిపారు. నిజం గెలవాలని కోరుకునేవారు 17–ఏ పట్టుకునే ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. నిజాన్ని ఓడించాలనే టీడీపీ ప్రయత్నం ఓడిపోతూనే ఉంద‌న్నారు.

హరికృష్ణ ఆత్మ శాంతిస్తోంది..

చంద్రబాబు అరెస్టుతో నందమూరి హరికృష్ణ ఆత్మ కూడా శాంతిస్తోందని మంత్రి అంబటి అన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లాక ఎన్టీఆర్, హరికృష్ణ, వంగవీటి రంగా, కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిస‌లాట‌ల్లో చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తున్నాయన్నారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోగ్యంపై నాటకం ఆడుతున్నారని మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని బాలకృష్ణ అన్నారని, మరి ఆయన కాకుండా ఇప్పుడు భువనేశ్వరి ఎందుకు వెళ్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ములాఖత్‌లో జరిగిన కుట్ర కాదా అని నిలదీశారు. నారా వారి చేతిలో నుంచి పార్టీ నందమూరి వారి చేతిలోకి వెళ్తుందనే భయం కాదా అని ప్రశ్నించారు.

చంద్రబాబు మోసాలు, అన్యాయాలు చేసే మనిషని, ఆయన జైలుకు వెళ్తే గుండెలు పగిలి జనం చచ్చిపోయారని కట్టుకథలు అల్లారని చెప్పారు. అసలు చంద్రబాబు అరెస్టుతో కలత చెంది ఎవరూ చనిపోలేదని మంత్రి అంబ‌టి స్పష్టం చేశారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు చంద్రబాబు ఏసీబీ కోర్టులో చెప్పారని, అయితే కొన్ని సంవత్సరాలుగా చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆయన చెప్పారు. క్వాష్‌ రాదనీ, బెయిల్‌ రాదనీ వారికి అర్థమైందని, అందుకే ఆరోగ్య సమస్యలు అంటూ హడావుడి చేశారని విమర్శించారు.

టీడీపీ వారు ఎన్ని డ్రామాలు చేసినా జనం నమ్మరని మంత్రి స్పష్టం చేశారు. అన్ని ఆధారాలతో కేసు బలంగా ఉందని, చంద్రబాబు కేసు నుంచి తప్పించుకోలేరని అంబ‌టి రాంబాబు తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేయటంపై అమిత్‌ షాతో మాట్లాడతానని చెప్పిన పవన్‌ ఏమయ్యారని మంత్రి అంబటి ప్రశ్నించారు. పవన్‌ రాజకీయాలకు పనికిరారని, నిజ జీవితంలో చేసినట్టే ఒకరితో ఉంటూ ఇంకొకరితో పొత్తు పెట్టుకోవటం ఏమిటని ఆయన నిలదీశారు.

First Published:  19 Oct 2023 11:24 AM GMT
Next Story