Telugu Global
Andhra Pradesh

జనాలు అసలు పట్టించుకోవటం లేదా?

జనాలంతా రోడ్లపైకి వచ్చి చంద్రబాబును కాపాడుకోవాలన్నారు. చంద్రబాబు కష్టమంతా జనాల కోసం రాష్ట్రాభివృద్ధి కోసమే అన్నారు. అయితే మామూలు జనాలు కాదు కదా చివరకు పార్టీ జనాలు కూడా రోడ్లపైకి రాలేదు.

జనాలు అసలు పట్టించుకోవటం లేదా?
X

తల్లి, కొడుకు తర్వాత మేనమామ కమ్ మామగారు వరుసగా బతిమలాడుకుంటున్నారు జనాలను. అయినా ఎవరూ పట్టించుకుంటున్నట్లు లేదు. విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడును నంద్యాలలో అరెస్టు చేయగానే భువనేశ్వరి విజయవాడలోని కనకదుర్గ ఆలయానికి వచ్చేశారు. ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పిల్లలకు కష్టమొస్తే తల్లికే కదా చెప్పుకుంటారు అని తాను కూడా దుర్గమ్మకే తన కష్టాలు చెప్పుకున్నట్లు చెప్పారు. ఇంతకీ భువనేశ్వరికి వచ్చిన కష్టాలు ఏమిటంటే చంద్రబాబు అరెస్ట్ అవ్వ‌డ‌మే.

ఎలాగూ అరెస్టయ్యారు కాబట్టి వెంటనే బెయిల్ వచ్చేట్లు చూడమని దుర్గమ్మను కోరుకున్నారు. చంద్రబాబు కష్టమంతా జనాల కోసమే అని, 24 గంటలూ, 365 రోజులూ ప్రజల సంక్షేమం కోసమే కష్టపడే వ్యక్తిని ప్రభుత్వం తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేసిందన్నారు. చంద్రబాబును కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు జనాల మీదే ఉందన్నారు. కాబట్టి జనాలంతా చేయి చేయి కలిపి రోడ్లపైకి రావాలని పిలుపిచ్చారు. అయితే మామూలు జనాలు కాదు కదా చివరకు పార్టీ జనాలు కూడా రోడ్లపైకి రాలేదు.

తర్వాత లోకేష్ వంతు వచ్చింది. మీడియాతో మాట్లాడుతూ.. జనాలంతా రోడ్లపైకి వచ్చి చంద్రబాబును కాపాడుకోవాలన్నారు. చంద్రబాబు కష్టమంతా జనాల కోసం రాష్ట్రాభివృద్ధి కోసమే అన్నారు. నిరంతరం ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పనిచేసే చంద్రబాబు మీద తప్పుడు కేసులు పెట్టినట్లు ప్రభుత్వంపై మండిపోయారు. కాబట్టి జనాలంతా సైకో పాలనకు నిరసనగా రోడ్లపైకి రావాలని కోరారు. అయితే ఇప్పుడు కూడా ఎవరూ పట్టించుకోలేదు.

ఇక చివరగా బామరిది కమ్ వియ్యంకుడు కమ్ లోకేష్ మామగారు నందమూరి బాలకృష్ణ కూడా ఇలాంటి పిలుపే ఇచ్చారు. జనాలందరూ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపాలన్నారు. తెలుగోడి సత్తా ఏమిటో చూపించాలన్నారు. అక్క‌డికి జగన్ బ్రిటీష్ వాడైనట్లుగా బాలయ్య మాట్లాడారు. తాను ముందు ఉండి పార్టీని నడిపిస్తానని, జనాలంతా రోడ్లపైకి రావాలన్నారు. ఎవరూ పట్టించుకోలేదు. అలాగే రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసొచ్చిన తర్వాత కూడా భువనేశ్వరి రెండోసారి జనాలను రోడ్లపైకి రమ్మని పిలుపిచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. ఇదంతా చూస్తుంటే జనాలు చంద్రబాబు అరెస్టును సీరియస్‌గా తీసుకోలేదనే అనిపిస్తోంది.

First Published:  13 Sep 2023 5:20 AM GMT
Next Story