Telugu Global
Andhra Pradesh

సచివాలయ ఉద్యోగుల పెన్షన్ పాట్లు

వర్షంతో సచివాలయ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. దీంతో వెంటనే సీఎం చంద్రబాబు నష్టనివారణ చర్యలు చేపట్టారు.

సచివాలయ ఉద్యోగుల పెన్షన్ పాట్లు
X

ఏపీలో భారీ వర్షాలకు ప్రజల్ని బయటకు రావొద్దని, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న ప్రభుత్వం.. సచివాలయ ఉద్యోగులకు మాత్రం పెన్షన్లు పంపిణీ చేయాలని టార్గెట్లు పెట్టింది. వాస్తవానికి సెప్టెంబర్-1 న పెన్షన్ల పంపిణీ మొదలు కావాల్సి ఉండగా.. ఆదివారం కావడంతో ఒకరోజు ముందే వాటిని పంపిణీ చేయాలని ఆదేశాలొచ్చాయి. దీంతో ఈరోజు ఉదయాన్నే వర్షంలో కూడా సచివాలయ ఉద్యోగులు గ్రామాలకు పరుగులుతీశారు. వర్షంలో చాలా ప్రాంతాల్లో వారు ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది.

గతంలో వాలంటీర్లు స్థానికంగా ఉండేవారు కాబట్టి.. తమకు కేటాయించిన 50 ఇళ్లలో లబ్ధిదారులకు పెన్షన్లు వెంటనే అందించేవారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు తాము పనిచేసే ప్రాంతాలకు ఉదయాన్నే బయయలుదేరి వెళ్లాల్సిన పరిస్థితి. వర్షం పడుతున్నా కూడా ప్రోగ్రెస్ కనపడాలని, ఉదయం ఆరుగంటలకే పంపిణీ మొదలు పెట్టాలని అధికారులు ఆదేశాలివ్వడం విశేషం. ఆరుగంటలకు పెన్షన్ పంపిణీ మొదలు పెట్టకపోతే నోటీసులిస్తారనే భయంతో సచివాలయ ఉద్యోగులు వర్షంలో కూడా గ్రామాలకు పరుగులు పెట్టారు.


ఆగ్రహం గ్రహించి ఆదేశాలు..

వర్షంతో సచివాలయ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. దీంతో వెంటనే సీఎం చంద్రబాబు నష్టనివారణ చర్యలు చేపట్టారు. పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులుంటే సచివాలయ ఉద్యోగులు గాభరా పడొద్దని, వచ్చే రెండ్లోజుల్లో పంపిణీ పూర్తి చేయొచ్చని సూచించారు. ఈ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావొద్దని, వారికి టార్గెట్లు పెట్టవద్దని కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలన్నారు సీఎం చంద్రబాబు.

తగ్గిన పొలిటికల్ హడావిడి..

గత రెండు నెలలు ఒకటో తేదీ ఉద్యోగులతోపాటు పెన్షన్లు పంపిణీ చేసి ప్రచారం చేసుకున్న నేతలు ఈసారి వర్షాల వల్ల కాస్త వెనక్కి తగ్గారు. అక్కడక్కడ పొలిటికల్ హడావిడి వల్ల సచివాలయ సిబ్బంది మరింత ఇబ్బంది పడ్డారు. నాయకులు ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోగా వర్షంలోనే సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు.

First Published:  31 Aug 2024 6:49 AM GMT
Next Story