Telugu Global
Andhra Pradesh

టీడీపీ అధినేతది శునకానందం.. పెద్దిరెడ్డి ఘాటు విమర్శలు

చంద్రబాబు నీతి మాలిన రాజకీయ నాయకుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పెద్దిరెడ్డి. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని, ఆయన్ను వెంటనే కుటుంబ సభ్యులు మానసిక వైద్యుడికి చూపించాలన్నారు.

టీడీపీ అధినేతది శునకానందం.. పెద్దిరెడ్డి ఘాటు విమర్శలు
X

సీఎం జగన్‌ను, తనను విమర్శిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సొంత కొడుకుని గెలిపించుకోలేని వ్యక్తి చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు తన హోదాను తానే దిగజార్చుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు నీతి మాలిన రాజకీయ నాయకుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పెద్దిరెడ్డి. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని, ఆయన్ను వెంటనే కుటుంబ సభ్యులు మానసిక వైద్యుడికి చూపించాలన్నారు. నిబద్ధత లేని చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గెలిపించబోరన్నారు పెద్దిరెడ్డి.

చిత్తూరు జిల్లాలో వైసీపీ అన్ని స్థానాల్లో గెలుస్తుందని జోస్యం చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి. వైసీపీలో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు కుప్పంలో పర్యటించిన మూడు రోజులు బ్లాక్ డేసేనని అన్నారాయన. కుప్పంలో వైసీపీ హయాంలో 7 వేల ఇళ్ళను నిర్మించామని, మరో 3 వేల ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. ఎమ్మెల్యేగా ఒక్కరికైనా చంద్రబాబు ఇల్లు కట్టించి ఇచ్చారా..? అని ప్రశ్నించారు.

మమ్మల్నే కొట్టి మాపై నిందలా..?

కుప్పంలో టీడీపీ నేతలే వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మూడు రోజుల చంద్రబాబు పర్యటనలో అధికంగా గాయపడింది వైసీపీ కార్యకర్తలేనని చెప్పారు. బయటి వ్యక్తులను తీసుకొచ్చి వైసీపీ కార్యకర్తలపై దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బ్యానర్లు చించి, రాళ్ళతో వైసీపీ కార్యకర్తలను కొట్టారని అన్నారు.

కుప్పం ప్రజలు చంద్రబాబును నమ్మడం లేదని, ఎమ్మెల్యేగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు పెద్దిరెడ్డి. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందని చెప్పారు. కుప్పంలో పెండింగ్‌లో ఉన్న తాగు-సాగు నీటి ప్రాజెక్టులను వైసీపీ పూర్తి చేస్తుందన్నారాయన. కుప్పంలో వైసీపీ విజయం ఖాయమని జోస్యం చెప్పారు.

First Published:  27 Aug 2022 9:03 AM GMT
Next Story