Telugu Global
Andhra Pradesh

వీళ్ళిద్దరికీ నియోజకవర్గమే లేకుండా చేశారా?

ఎన్నికలన్నాక గెలుపోటములు చాలా సహజం. అయితే వ‌చ్చే ఎన్నికల్లో అయినా కచ్చితంగా గెలవాలనే పట్టుదలకు బదులు మళ్ళీ ఓటమి భయమే ఎక్కువగా కనబడుతోంది వీళ్ళల్లో.

వీళ్ళిద్దరికీ నియోజకవర్గమే లేకుండా చేశారా?
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎక్కడ నుండి పోటీ చేయాలో అర్థంకాక ఒకరు, రెండోసారి కూడా ఓటమి తప్పదేమో అని మరొక‌రు టెన్షన్ పడుతున్నారంటే ఏమిటర్థం? పోయిన ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాకలో పోటీచేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక లోకేష్ మంగళగిరిలో పోటీచేసి ఓడిపోయారు. ఇద్దరూ కూడా ఎన్నికల్లో పోటీ చేసింది మొదటిసారే.

ఎన్నికలన్నాక గెలుపోటములు చాలా సహజం. అయితే వ‌చ్చే ఎన్నికల్లో అయినా కచ్చితంగా గెలవాలనే పట్టుదలకు బదులు మళ్ళీ ఓటమి భయమే ఎక్కువగా కనబడుతోంది వీళ్ళల్లో. దీనికి ఉదాహరణ ఏమిటంటే తాను ఎక్కడి నుండి పోటీ చేసేది ఇప్పుడే చెప్పనని పవన్ అనటమే. తాను ఏ నియోజకర్గంలో పోటీ చేసేది ఇప్పుడే చెప్పేస్తే తనను ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి రూ.200 కోట్లు ఖర్చుపెడతారని పవన్ బహిరంగంగానే ప్రకటించారు. అంటే జగన్ దెబ్బకు పవన్ ఎంతలా భయపడుతున్నారో అర్థ‌మవుతోంది.

ఇక లోకేష్ అయితే ఆ మధ్య మంగళగిరిలో పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ లోలోపల మాత్రం పునరాలోచనలో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో జగన్ ప్రభుత్వం 51 వేల ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసిన తర్వాత పోటీ విషయమై లోకేష్‌ రెండో ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. భీమిలీ, హిందుపురం, పెనమలూరు నియోజకవర్గాల్లో పోటీ చేసే విషయమై ఆలోచిస్తున్నారంటు ప్రచారం జరుగుతోంది.

లోకేష్ సంగతి పక్కనపెట్టేసినా ఎక్కడ నామినేషన్ వేసినా పవన్ గెలిచిపోవాలి. పవన్ పోటీ చేస్తున్నారంటే ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థులు వణికిపోవాలి. ఎందుకంటే పవన్‌కు ఉన్న‌ ఫ్యాన్, మాస్ ఫాలోయింగ్ ఆ స్థాయిలో ఉంటుంది. అలాంటిది నియోజకవర్గాన్ని ప్రకటించటానికి వణికిపోతున్నారంటేనే జగన్ దెబ్బ ఏ స్థాయిలో పవన్‌పై పడిందో అర్థ‌మైపోతోంది. పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలు తిరుపతి, భీమిలీ, నరసాపురం, విశాఖ ఉత్తరం, గాజువాక, పిఠాపురం, భీమవరం అని చాలా పేర్లు వినబడుతున్నాయి. అయితే పవన్ మాత్రం ఒక్క పేరూ చెప్పటంలేదు. మరెప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

First Published:  19 Aug 2023 5:29 AM GMT
Next Story