Telugu Global
Andhra Pradesh

జగన్ పథకాలకు జై కొట్టిన పనన్.. కానీ..!

గతంలో ఓసారి టీడీపీ, బీజేపీతో పోల్చి చెబుతూ జనసేనకు సంస్థాగత బలం లేదని తేల్చేసిన పవన్, మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. సమూహాన్ని క్రమశిక్షణతో నడిపించే మెకానిజం ఇంకా జనసేన సాధించలేదన్నారు.

జగన్ పథకాలకు జై కొట్టిన పనన్.. కానీ..!
X

ఏపీలో సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పథకాలకు వంకలు పెట్టేందుకు వణికిపోతున్నారు కూటమి నేతలు. పిఠాపురంలో జరిగిన మూడు పార్టీల నేతల ఆత్మీయ సమావేశంలో కూడా పవన్ ఇదే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా జగన్ పథకాలకు పవన్ జై కొట్టారు. ఆ పథకాలు తాము కూడా కొనసాగిస్తామన్నారు. అయితే జగన్ వాటిని అప్పులు చేసి అమలు చేస్తున్నారట. తాము అధికారంలోకి వస్తే అప్పులు లేకుండా పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు జనసేనాని.

మండల దీక్ష..

రాక్షస పాలన అంతమవ్వాలంటే మండల దీక్ష చేపట్టాలని, 40రోజులు దీక్షగా ఎన్నికలకోసం పనిచేయాలని మూడు పార్టీల నేతలకు పిలపునిచ్చారు పవన్ కల్యాణ్. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పొత్తు కోసం తాను తపించానని చెప్పారు. రాబోయేది కూటమి ప్రభుత్వమేనని, భారీ మెజార్టీ ఖాయమని ధీమాగా చెప్పారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు.. తమకు ఎంపీ స్థానాలు ఎక్కువ కావాలని కోరడంతో జనసేన త్యాగం చేయాల్సి వచ్చిందని, అందుకే తమపార్టీ కేవలం 2 లోక్‌సభ స్థానాలకే పరిమితమైందని వివరించారు. బీజేపీ పెద్దల మనోభీష్టాన్ని కాదనకుండా ముందుకు వెళ్లామని చెప్పుకొచ్చారు పవన్.


జనసేనకు ఆ సీన్ లేదు..

గతంలో కూడా ఓసారి టీడీపీ, బీజేపీతో పోల్చి చెబుతూ జనసేనకు సంస్థాగత బలం లేదని తేల్చేసిన పవన్, మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. బీజేపీ, టీడీపీ బలమైన పునాదులు కలిగిన పార్టీలని చెప్పారు. సమూహాన్ని క్రమశిక్షణతో నడిపించే మెకానిజం ఇంకా జనసేన సాధించలేదన్నారు. తమ పార్టీలో యువబలం, పోరాడేతత్వం మెండుగా ఉన్నాయని మాత్రం సెలవిచ్చారు.

ఆ బాధలోనుంచి పొత్తు పొడిచింది...

చంద్రబాబుని జైలులో పెట్టినప్పుడు తనకు బాధ కలిగిందని చెప్పారు పవన్ కల్యాణ్. ఆయన్ను వైసీపీ ప్రభుత్వం అకారణంగా జైలులో బంధించిందన్నారు. రాజమండ్రి వెళ్తున్నపుడు దారి పొడవునా టీడీపీ కార్యకర్తలు తమ నాయకుడి కోసం పడిన తపన.. తనను కదిలించిందన్నారు. అందుకే రాజమండ్రి జైలులో చంద్రబాబుని కలిసిన తరువాత పొత్తు ప్రకటన చేశానన్నారు పవన్.

First Published:  31 March 2024 2:59 PM GMT
Next Story