Telugu Global
Andhra Pradesh

24 సీట్లపై పవన్ క‌ల్యాణ్‌ వింత వాదన.. ఆ దమ్ము ఉందా..?

24 సీట్లే తీసుకోవడంపై తనను విమర్శిస్తున్నారని, సంఖ్య ముఖ్యం కాదని, జనసేన ప్రజా సైన్యమని, గాయత్రి మంత్రంలో 24 అక్ష‌రాలే ఉంటాయని, అయినా ఆ మంత్రం శక్తిమంతమైందని ఆయన అన్నారు.

24 సీట్లపై పవన్ క‌ల్యాణ్‌ వింత వాదన.. ఆ దమ్ము ఉందా..?
X

తాను 24 అసెంబ్లీ స్థానాలు మాత్రమే తీసుకోవడంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వింత వాదన మొద‌లుపెట్టారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జ‌న‌సేన‌కు కేవ‌లం 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలు ఇస్తే పవన్‌ కల్యాణ్‌ తల ఊపిన విషయం తెలిసిందే. దాన్ని సమర్థించుకోవడానికి తాడేపల్లిగూడెం సభలో తీవ్ర ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం వల్ల ఆయన బలహీనత ఏమిటో బయటపడింది. తాము 24 స్థానాలు గెలిస్తే తమ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబును నియంత్రించగలనని నమ్మబలకడానికి ఆయన ముప్పు తిప్పలు పడ్డారు. నిజానికి, చంద్రబాబును నియంత్రించే దమ్ము పవన్‌ కల్యాణ్‌కు ఉందా అనేది ప్రశ్న. చంద్రబాబు కుయుక్తుల ముందు ఆయన చిత్తుకాక తప్పదనే విషయం వరుసగా సంభవిస్తున్న పరిణామాల వల్ల అర్థమవుతూనే ఉంది.

తాను చంద్రబాబు నుంచి దక్కించుకున్న 24 సీట్లలో జ‌న‌సేన ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పడం కూడా కష్టమే. 24 సీట్లే తీసుకోవడంపై తనను విమర్శిస్తున్నారని, సంఖ్య ముఖ్యం కాదని, జనసేన ప్రజా సైన్యమని, గాయత్రి మంత్రంలో 24 అక్ష‌రాలే ఉంటాయని, అయినా ఆ మంత్రం శక్తిమంతమైందని ఆయన అన్నారు. వామనుడు మూడు అడుగుల స్థలం మాత్రమే అడిగాడని, అంతేనా అని బలిచక్రవర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశాడని, అంతేనని వామనుడు సమాధానమిచ్చాడని, దాంతోనే తన శక్తి ఏమిటో వామనుడు నిరూపించాడని ఆయన అన్నారు. తన శక్తి ఏమిటో జగన్‌కు చూపిస్తానని ప‌వ‌న్‌ ప్రగల్భాలు పలికారు.

గత ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలిచి కూడా ప్రజాసమస్యలపై జగన్‌కు చుక్కలు చూపించామని ఆయన అర్థం పర్థం లేకుండా మాట్లాడారు. తాము 24 సీట్లు గెలిస్తే ఏమవుతుందో ఊహించుకోండని ఆయన ఊగిపోయారు. వ్యూహాన్ని తనకు వదిలేయాలని, టీడీపీ లాగా పార్టీని నిర్మాణం చేయడానికి తనకు దశాబ్దాల అనుభవం లేదని ఆయన చెప్పారు. ఇటుక మీద ఇటుక పేర్చి ఇళ్లు కడుతున్నామని ఆయన చెప్పారు.

తనకు సలహాలు అక్కర్లేదని, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు తనకు కావాలని ప‌వ‌న్ అన్నారు. తమకు బూత్‌ స్ఠాయి సభ్యులు లేరని, జగన్‌ మాదిరిగా 53 రోజులు వేయి మందికి పంచడానికి డబ్బులు లేవని చెప్పుకొచ్చారు. తాము ఇంకా విస్తరించే దశలోనే ఉన్నామని, తాము రాష్ట్రాన్ని జగన్‌కు అప్పగించదలుచుకోలేదన్నారు. అందుకే తాను 24 సీట్లు మాత్రమే తీసుకున్నానని ఆయన సమర్థించుకోవడానికి చూశారు.

నిజమైన అనుచరులు తనను ప్రశ్నించబోరని, తనకు మద్దతుగా నిలబడుతారని ప‌వ‌న్ చెప్పారు. నిజమైన అనుచరులైతే తన పక్కన ఎలా నించోవాలో, ఎలా తనకు మద్దతు ఇవ్వాలో ఆలోచించాలని ఓ ఉచిత సలహా పడేశారు.

First Published:  29 Feb 2024 2:55 PM GMT
Next Story