Telugu Global
Andhra Pradesh

పవన్ ఒక్క ఛాన్స్‌..! బాబు చివరి ఛాన్స్‌..!

చంద్ర‌బాబు చర్యలు,వ్యాఖ్యలు ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్న‌ట్టు సూచిస్తున్నవి.తాజా రాజ‌కీయ ప‌రిణామాలు ఆయ‌నను బాగా కుంగ‌దీస్తున్నవి.పవన్ కళ్యాణ్ తో ప్ర‌ధాని మోడీ భేటీ టీడీపీని ఒక భారీ కుదుపునకు గురిచేసింది

పవన్ ఒక్క ఛాన్స్‌..! బాబు చివరి ఛాన్స్‌..!
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగస్థలంపై రెండు నినాదాలు హోరెత్తుతున్నాయి.ఒకటి పవన్ కళ్యాణ్ 'ఒక్కఛాన్సు',రెండవది చంద్రబాబు 'చివరి ఛాన్సు'! ఈ రెండు నినాదాలు ఆకర్షణీయంగానే ఉన్నవి. కానీ సమస్య అంతా సాధారణ ఓటర్లను ఇవి ఏ మేరకు ఆకట్టుకోగలవో, ఏ మేరకు వారి అభిమానాన్ని, మద్దతును కూడగట్టగలవో అన్నదే. దాన్ని ఇప్పుడే అంచనా వేయడం కష్టం. అందుకు ఇంకా సమయం కావాలి. ఏపీలో రాజకీయ బలాబలాలు ఇంకా కొలిక్కి రావలసి ఉన్నది. రాజకీయ సమీకరణలు తేలవలసి ఉన్నది. పొత్తులు ఖరారు కావలసి ఉన్నది. ఎత్తులు, జిత్తులపై స్పష్టత రావలసి ఉన్నది.

జనసేన 'హీరో' పవన్ కళ్యాణ్ అదృష్టవంతుడు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఆయనకు నష్టం లేదు. అంతా లాభమే!కూడికలు, తీసివేతలతో పవన్ కు నిమిత్తం లేదు.కానీ చంద్రబాబు నాయుడు పరిస్థితి అలాంటిది కాదు.పవన్ కళ్యాణ్ లాగా 'సేఫ్ గేమ్' కాదు.చావో రేవో ! జీవన్మరణ సమస్య.వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే టీడీపీ మనుగడ ప్రశ్నార్థకమే!చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ఆగమ్యగోచరంలో పడుతుంది. కనుక ఆయన 'చివరి ఛాన్సు' అనే సానుభూతి అస్త్రాన్ని సంధిస్తున్నారు.ఇదో రకమైన 'ఎమోషనల్ బ్లాక్ మెయిలింగు' అని నిర్ధారణకు రావచ్చు.పవన్ కళ్యాణ్ 'ఒక్క ఛాన్సు' నినాదం వర్కవుట్ అయినా,కాకపోయినా ఆయనకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్నది.2029 ఉన్నది లేదా 2034 ఎన్నికలు.చంద్రబాబు వయోభారం రీత్యా 2024 ఎన్నికలే చిట్టచివరివి.ఈ సంగతి ఆయనే కర్నూలు జిల్లాలో చెప్పేశారు.పార్టీకి తన బ్రాండ్ మినహా మరొక ఆకర్షణ లేకపోవడం,పుత్రరత్నం లోకేష్ పార్టీని నడిపించగల శక్తి,సామర్ధ్యాలను పుణికి పుచ్చుకోకపోవడం చంద్రబాబుకు దిగులుగా ఉన్నది.

కాగా, చంద్ర‌బాబు చర్యలు,వ్యాఖ్యలు ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్న‌ట్టు సూచిస్తున్నవి.తాజా రాజ‌కీయ ప‌రిణామాలు ఆయ‌నను బాగా కుంగ‌దీస్తున్నవి.పవన్ కళ్యాణ్ తో ప్ర‌ధాని మోడీ భేటీ టీడీపీని ఒక భారీ కుదుపునకు గురిచేసింది.చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ ను వేరు చేయడంలో బీజేపీ ప్రస్తుతానికి విజయం సాధించినట్లే! అయితే ఈ పరిస్థితే 2024 దాకా ఉండవచ్చు,ఉండకపోవచ్చు.పవన్ తో చంద్రబాబు స్నేహం పునరుద్ధరణ కావచ్చు.కాకపోవచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు.

తనను ప్రధాని మోడీ టార్గెట్ చేసినట్టు చంద్రబాబు భావిస్తున్నారు.టీడీపీని అధికారంలోకి రానివ్వ‌కుండా కట్టడి చేస్తున్నట్టు తన సన్నిహితుల దగ్గర చంద్రబాబు వాపోతున్నారు.తన భ‌విష్య‌త్‌ రాజకీయంపై ఆయన బెంగ‌ పెట్టుకున్నారు. తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ జ‌గ‌నే అధికారంలోకి వ‌స్తార‌ని సిపిఐ,సిపిఎం నాయకులు మీడియా సమావేశాల్లో మాట్లాడుతుండడం టీడీపీ జాతీయ అధ్యక్షున్ని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.టీడీపీ ఒంట‌రిగా పోటీ చేస్తే పుట్ట‌గ‌తులుండ‌వ‌ని చందద్రబాబుకు తెలుసు.ప్ర‌ధానితో భేటీ త‌ర్వాతే 'ఒక్క చాన్స్' నినాదాన్ని పవన్ బయటకు తీశారు. ప‌వ‌న్‌లో వ‌చ్చిన మార్పు చంద్రబాబును కలవరపెట్టడంలో ఆశ్చర్యమేమీ లేదు.పదో,పదిహేను అసెంబ్లీ స్థానాలతో పవన్ కు స‌రిపెట్టి కాపు సామాజిక వ‌ర్గం ఓట్ల‌ను కొల్ల‌గొట్టొచ్చ‌వచ్చునని టీడీపీ వేసిన ఎత్తుగ‌డ తలకిందులయ్యింది.చంద్రబాబు కంటే రెండాకులు ఎక్కువ చెడిన మోడీ,అమిత్ షా వేగంగా పావులు కదుపుతున్నారు.

తమ కూటమి ముఖ్యమంత్రి అభ్య‌ర్థిగా ప‌వ‌న్‌ను ప్ర‌క‌టించాలని బీజేపీ హైకమాండ్ ఇప్పటికే మానసికంగా సిద్ధమైంది. ఆకస్మికంగా వచ్చిపడ్డ ఈ 'సంక్షోభాన్ని' ఎలా ఎదుర్కోవాలో చంద్రబాబుకు అంతు చికెక్కడం లేదు. అలాగే పార్టీలోని అస‌మ్మ‌తి కూడా ఆయనకు చిక్కులు తెచ్చిపెడుతున్న వి.కొవ్వూరు, క‌ళ్యాణ‌దుర్గం, స‌త్తెన‌ప‌ల్లి,అనంతపురం,రాయచోటి,నంద్యాల, బనగానపల్లె, చిత్తూరు ... ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం 30 కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలలో అసమ్మతి పోటు ఎక్కువగా ఉన్నది. కాగా 130 కి పైగా నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల‌తో చంద్ర‌బాబు ఇప్పటికే స‌మీక్ష నిర్వ‌హించారు. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌ను సహించబోనని పదేపదే హెచ్చరించినా ఫలితం ఉండడం లేదు.

First Published:  18 Nov 2022 1:30 AM GMT
Next Story