Telugu Global
Andhra Pradesh

పవన్ హిడెన్ అజెండా ఇదేనా..?

ఎందుకంటే పార్టీకి నిర్మాణమే జరగలేదు. ఓట్లేయించే యంత్రాంగం జనసేన‌కు లేదు. గట్టిగా ప్రచారం చేసే దిక్కుకూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 2019 రిజల్టే వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదనే భయం మొదలైనట్లుంది.

పవన్ హిడెన్ అజెండా ఇదేనా..?
X

వచ్చేఎన్నికల్లో ఒంటిరిగా పోటీచేసినా, బీజేపీతో కలిసి పోటీచేసినా ఫలితం ఎలాగుంటుందో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బాగా తెలుసు. పై రెండు పద్దతుల్లో ఏ విధంగా ఎన్నికలకు వెళ్ళినా మళ్ళీ రెండోసారి దెబ్బతినక తప్పదు. ఒంటరిగా ఎన్నికలకు వెళితే జనసేనకు మళ్ళీ వీరమరణం తప్పదని స్వయంగా పవనే బహిరంగసభలో చెప్పేశారు. రెండు చోట్లా ఓటమి కారణంగా ఇప్పటికే మంత్రులు, వైసీపీ నేతల ర్యాగింగ్‌ను పవన్ తట్టుకోలేకపోతున్నారు.

అందుకనే వచ్చేఎన్నికల తర్వాత తనను ర్యాగింగ్ చేసే అవకాశం వైసీపీకి ఇవ్వకూడదని పవన్ గట్టిగా డిసైడ్ అయ్యారు. ఇక్కడే హిడెన్ అజెండా రెడీ చేసుకున్నారు. ఇంతకీ ఆ అజెండా ఏమిటంటే టీడీపీతో పొత్తుపెట్టుకోవటం. వచ్చేసారి తాను ఎక్కడినుంచి పోటీచేసినా గెలవాలని అనుకుంటే అది టీడీపీతో పొత్తుద్వారా మాత్రమే సాధ్యమని పవన్ డిసైడ్ అయిపోయారు. విడిగా పోటీచేస్తే గెలుపు అనుమానమే అని అర్థ‌మైనట్లంది. వైసీపీ, టీడీపీ అభ్యర్థులను ఢీకొని వాళ్ళకన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకోవటం కష్టమని తెలుసుకున్నట్లున్నారు.

ఎందుకంటే పార్టీకి నిర్మాణమే జరగలేదు. ఓట్లేయించే యంత్రాంగం జనసేన‌కు లేదు. గట్టిగా ప్రచారం చేసే దిక్కుకూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 2019 రిజల్టే వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదనే భయం మొదలైనట్లుంది. అందుకనే వచ్చేఎన్నికల్లో ఎక్కడో ఒకచోట గెలిచి తీరాల్సిన అవసరం పవన్‌కు ఉంది. లేకపోతే వైసీపీని తట్టుకుని ఇక రాజకీయాల్లో కంటిన్యూ అయ్యేది కష్టమే.

అందుకనే టీడీపీతో పొత్తుపెట్టుకుంటేనే కానీ గెలవలేమని డిసైడ్ అయినట్లున్నారు. గౌరవం, మర్యాద అని చెప్పిందంతా ఉత్త కబుర్లు మాత్రమే. చంద్రబాబు ఎన్నిసీట్లిచ్చినా పొత్తు ఖాయమే అన్నట్లుంది పవన్ లెక్క. ఎందుకంటే తాను గెలవటమే ప్రధానమైన అజెండా. పవన్ ఇక్కడినుండే పోటీచేయబోతున్నారంటూ ఇప్పటికే తిరుపతి, విశాఖ ఉత్తరం, భీమిలి, కాకినాడ రూరల్, పిఠాపురం అని చాలా నియోజకవర్గాల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడినుండి చేసినా టీడీపీ సహకారం లేకపోతే గెలుపు కష్టమని ఇప్పటికే ఫిక్సయిపోయినట్లున్నారు. మరి పవన్ అనుకుంటున్నట్లు టీడీపీ ఓట్లు జనసేనకు బదిలీ అవుతాయా..?

First Published:  19 Jan 2023 3:00 AM GMT
Next Story