Telugu Global
Andhra Pradesh

నాన్ లోకల్.. పవన్ ఓటమికి అదే తొలి కారణం అవుతుందా..?

ఒకవేళ పవన్ గెలిచినా పిఠాపురంలో ఎవరికీ అందుబాటులో ఉండరని, ఆయన్ను కలవాలంటే హైదరాబాద్ కి వెళ్లాలని, లేకపోతే షూటింగ్ లొకేషన్ ఎక్కడో కనుక్కొని వెళ్లాల్సి ఉంటుందని సెటైర్లు పేల్చారు వంగా గీత.

నాన్ లోకల్.. పవన్ ఓటమికి అదే తొలి కారణం అవుతుందా..?
X

పవన్ కల్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్. ఆయన సినిమాలకు ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో వస్తాయి. కానీ రాజకీయాల్లో.. ఆయన ఓ ఫెయిల్యూర్ స్టార్. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన దారుణ చరిత్ర ఆయనకుంది. ఈసారి పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన ఆ నియోజకవర్గాన్ని పవన్ ఎంపిక చేసుకున్నారనే విషయం అందరికీ తెలుసు. కేవలం కాపు ఓటు బ్యాంక్ తనకి కలిసొస్తుందని అనుకున్నారాయన. కానీ అంతకు మించి ఆయనకు అక్కడ నష్టం జరుగుతోంది. పవన్ కల్యాణ్ గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండరంటూ వైసీపీ అభ్యర్థి వంగా గీత చేస్తున్న విమర్శలు పవన్ కి డ్యామేజీగా మారుతున్నాయి.

పవన్ కల్యాణ్ కోసం నాగబాబు కుటుంబం ప్రచారం చేస్తోంది. మెగా ఫ్యామిలీకి చెందిన ముగ్గురు యంగ్ హీరోలు, ఇతర జబర్దస్త్ నటులు పిఠాపురం వచ్చారు, ఇంటింటికీ తిరుగుతున్నారు. పవన్ గెలుగు గ్యారెంటీ అని అనుకుంటే జబర్దస్త్ టీమ్ అంతా ఎందుకని సూటిగా ప్రశ్నిస్తున్నారు వైసీపీ అభ్యర్థి వంగా గీత. కాపు ఓట్లు వన్ సైడ్ గా పవన్ కి పడతాయని అనుకోవడం భ్రమేనంటున్నారామె. ఒకవేళ పవన్ గెలిచినా పిఠాపురంలో ఎవరికీ అందుబాటులో ఉండరని, ఆయన్ను కలవాలంటే హైదరాబాద్ కి వెళ్లాలని, లేకపోతే షూటింగ్ లొకేషన్ ఎక్కడో కనుక్కొని వెళ్లాల్సి ఉంటుందని సెటైర్లు పేల్చారు. ఇప్పుడు పవన్ కోసం ప్రచారం చేస్తున్న వారెవరూ రేపు మీకోసం నిలబడరని ప్రజలకు వివరించి చెబుతున్నారు వంగా గీత. స్థానికంగా అందుబాటులో ఉండే తనకు ఓటువేసి గెలిపిస్తే.. జగన్ పాలనలో అభివృద్ధి పాలన అందుతుందని భరోసా ఇస్తున్నారు.

పవన్ ఓటమి ఖాయమేనా..?

ఈసారి కుప్పం, మంగళగిరి, పిఠాపురం.. ఈ మూడు నియోజకవర్గాల ఫలితాలపై అందరికీ ఆసక్తి ఉంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం టాక్ ఆఫ్ ఏపీగా మారింది. పిఠాపురంలో పవన్ తరపున మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది. చివరిగా చిరంజీవి కూడా తమ్ముడికోసం ప్రచారానికి వస్తారని అంటున్నారు. అయితే పవన్ కి నాన్ లోకల్ అనే అంశం పూర్తిగా వ్యతిరేకంగా మారుతోంది. గెలిచినా నియోజకవర్గం మొహం చూడనివారికి ఓటు వేయడం అవసరమా అని ప్రజలు ఆలోచిస్తున్నారు.

First Published:  4 May 2024 9:10 AM GMT
Next Story