Telugu Global
Andhra Pradesh

నా పుట్టలో వేలు పెడితే ఊరుకుంటానా..? పవన్ కి ఆస్కార్ ఇచ్చేస్తా..

కాపులంతా ఓటు వేస్తే తాను ఓడిపోయే వాడిని కాదని పవన్ అనడం దౌర్భాగ్యం అని అన్నారు నాని. ఒక కులం ఓట్లతో గెలిచే వారు కుల నాయకుడు అవుతారని, ప్రజా నాయకుడు కాలేరన్నారు.

నా పుట్టలో వేలు పెడితే ఊరుకుంటానా..? పవన్ కి ఆస్కార్ ఇచ్చేస్తా..
X

జనసేన ఆవిర్భావ సభ కోసం పవన్ కల్యాణ్ మచిలీపట్నాన్ని ఎంచుకోవడం, అక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా సభకు ఏర్పాట్లు జరగడం అంతా చకచకా జరిగిపోయాయి. అయితే అది మాజీ మంత్రి పేర్ని నాని సొంత నియోజకవర్గం కావడం, పైగా ఇద్దరూ ఒకే సామాజిక వర్గం కావడంతోనే ఇక్కడ రచ్చ మొదలైంది. జనసేన సభపై పేర్ని నాని రగిలిపోతున్నారు. ఆ సభ విజయవంతం అయితే అది తన ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తుందేమోనని ఆందోళనలో ఉన్నారు నాని. సరిగ్గా సభ ముందురోజు పవన్ కల్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పవన్ ఊడిగం..

2014 నుంచి పవన్ కల్యాణ్, చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు పేర్ని నాని. తన తల్లిని టీడీపీవాళ్లు తిట్టించారని చెప్పిన పవన్ ఇప్పుడు చంద్రబాబుతో ఎందుకు కలసి పనిచేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. “మా నాన్న కాపు, అమ్మ బలిజ” అంటూ పవన్ కొత్తగా చెబుతున్నారని, ఆయన నోరు విప్పితే అబద్ధాలే వస్తాయన్నారు. రాజకీయం కోసం ఎంతకైనా తెగించే రకం పవన్ కల్యాణ్ అన్నారు. కాసేపు తనకు కులం లేదంటారని, కాసేపు రెల్లి కులం అంటారని ఎద్దేవా చేశారు. ప్రజాసేవ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే పవన్ కి కులంతో ఏం పని అని ప్రశ్నించారు. 2024 మార్చి కల్లా పవన్, చంద్రబాబు ముసుగు బయటపెట్టక తప్పదన్నారు.

కాపులంతా ఓటు వేస్తే తాను ఓడిపోయే వాడిని కాదని పవన్ అనడం దౌర్భాగ్యం అని అన్నారు. ఒక కులం ఓట్లతో గెలిచే వారు కుల నాయకుడు అవుతారని, ప్రజా నాయకుడు కాలేరన్నారు. కమ్మవారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు కాపుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.

రాజకీయ ఆస్కార్ పవన్ కే..

రాజకీయాల్లో ఆస్కార్ ఉండి ఉంటే పవన్ కల్యాణ్ కే వచ్చే ఉండేదన్నారు పేర్ని నాని. మరో నామినేషన్ కూడా ఉండేది కాదన్నారు. హరిరామ జోగయ్యను చూస్తే జాలేస్తోందన్నారు నాని. “నెలలో రెండు రోజులే కదా ఇక్కడ ఉండేది. మిగిలిన రోజులన్నీ తెలంగాణలోనే ఏడుస్తావ్ గా. తెలంగాణ లో ఎందుకు ప్రశ్నించవు?? కేసీఆర్ ను ఎందుకు నిలదీయవు?? ” అని ప్రశ్నించారు పేర్ని నాని.

First Published:  14 March 2023 3:20 AM GMT
Next Story