Telugu Global
Andhra Pradesh

సినిమా స్టైల్ ప్రచారం.. రాజకీయాల్లో ఏమేరకు లాభం..?

వారాహి మేకింగ్ స్టిల్స్, టీజర్, ట్రైలర్ అన్నీ.. సినిమా స్టైల్ ని తలపించాయి. విచిత్రం ఏంటంటే.. ఆ వాహనం రెడీ అయ్యేలోగా మూడుసార్లు పవన్ పర్యటన వాయిదా పడింది.

సినిమా స్టైల్ ప్రచారం.. రాజకీయాల్లో ఏమేరకు లాభం..?
X

జనసైనికుల్లో నిన్నంతా ఒకటే సందడి. మా నాయకుడి వాహనం సిద్ధమైంది. జనాల్లోకి వచ్చేస్తున్నాడు, ఈసారి సాధిస్తాడు, మార్పు తెస్తాడు, జగన్ ని ఓడిస్తాడంటూ వాట్సప్ స్టేటస్ లు, డీపీలు, సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు. అయితే పవన్ వాహనం, ఆ ఫొటో స్టిల్స్, బౌన్సర్ల లాంటి బాడీ గార్డ్ ల రన్నింగ్ స్టైల్.. ఈ హంగామా అంతా సినిమా షూటింగ్ ని తలపించక మానదు. సినిమా స్టైల్ లో మొదలైన ఈ ప్రచారం రాజకీయాల్లో ఏమేరకు పవన్ కి లాభం చేకూర్చుతుందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.

వాహనం గంభీరంగా ఉంటే సరిపోతుందా..?

అప్పుడెప్పుడో ఎన్టీఆర్ వాడిన ప్రచార రథం తర్వాత ఆ స్థాయిలో పవన్ కల్యాణ్ వాహనానికి ప్రచారం కల్పించాలనుకున్నారు నిర్వాహకులు. ఆ స్థాయిలోనే మొదలు పెట్టారు, వాహనం రెడీ అవుతున్నప్పుడు రెండు మూడు స్టిల్స్ వదిలారు. ఆ పనుల్ని పవన్ పర్యవేక్షిస్తున్నట్టు చూపించారు. తీరా ఇప్పుడు వాహనం రెడీ అయింది అంటూ ఓ టీజర్ విడుదల చేశారు. ఈ మేకింగ్ స్టిల్స్, టీజర్, ట్రైలర్ అన్నీ.. సినిమా స్టైల్ ని తలపించాయి. విచిత్రం ఏంటంటే.. ఆ వాహనం రెడీ అయ్యేలోగా మూడుసార్లు పవన్ పర్యటన వాయిదా పడింది. ప్రస్తుతం కొండగట్టులో పూజ అంటున్నారు కానీ, ఆ తర్వాత పవన్ ఎక్కడెక్కడ ఎప్పుడు ప్రచారం చేస్తారు, ఎలా తన యాత్రను మొదలు పెడతారనే విషయంలో క్లారిటీ లేదు.

ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారా..?

జనసేన-టీడీపీ పొత్తు విషయంలో పవన్ ఇంకా సందిగ్ధంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. విశాఖ ఎపిసోడ్ తర్వాత పవన్ ని పరామర్శించడానికి చంద్రబాబు రావడంతో దాదాపు పొత్తుపొడిచినట్టే అనుకున్నారు. ఆతర్వాత మోదీ విశాఖ వచ్చి పవన్ కి హితోపదేశం చేసి చంద్రబాబు ఆశలపై నీళ్లు చళ్లారు. ఇప్పుడు పవన్, బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ఫాలో కావాలా, లేక సొంతగా ఆలోచించాలా, చంద్రబాబుతో కలసి నడవాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. వారాహి వాహనంలో పవన్ ప్రచారానికి వెళ్లినా రేపు కేవలం జగన్ నే టార్గెట్ చేయాలా, లేక చంద్రబాబుని కూడా విమర్శించాలా, జనసేన అభ్యర్థిని గెలిపించాలని చెప్పాలా, లేక బీజేపీ అభ్యర్థులకు కూడా ఓట్లు వేయండి అని ప్రజలకు పిలుపునివ్వాలా తేల్చుకోలేని పరిస్థితి. ప్రస్తుతానికి వాహనం మాత్రమే రెడీ అయింది, పవన్ అజెండా ఇంకా రెడీ కాలేదు.

First Published:  8 Dec 2022 1:20 AM GMT
Next Story