Telugu Global
Andhra Pradesh

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. బీజేపీకి సపోర్ట్ గా పవన్ వ్యాఖ్యలు

బీజేపీ నేతలపై జరిగిన దాడిని అధినాయకత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు పవన్.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. బీజేపీకి సపోర్ట్ గా పవన్ వ్యాఖ్యలు
X

ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు దాదాపుగా ముగిసిపోయిన అధ్యాయమనే చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనను అడగకుండా బీజేపీ అభ్యర్థుల్ని పెట్టింది, బీజేపీ అభ్యర్థులకు జనసేన ఓటు వేయలేదు. ఇక్కడితో ఆ పొత్తుకు కాలం చెల్లినట్టే. ఇటీవల పవన్ కల్యాణ్ మీటింగుల్లో కూడా ఎక్కడా బీజేపీతో పొత్తు అనే విషయం బయటకు రాలేదు. రోడ్ మ్యాప్ ఏమైపోయిందో కూడా తెలియదు. అయితే చాన్నాళ్ల తర్వాత పవన్ కల్యాణ్ ఇప్పుడు బీజేపీకి మద్దతుగా మాట్లాడారు, బీజేపీ నాయకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఏపీలో వైసీపీ దాదాగిరి పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు.

అమరావతి రైతుల ఉద్యమం 1200 రోజుకి చేరుకున్న సందర్భంగా వారికి బీజేపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, సత్యకుమార్ మద్దతు తెలిపారు. తిరిగి వెళ్లే క్రమంలో సత్యకుమార్ కారుని మూడు రాజధానుల మద్దతుదారులు అడ్డుకున్నారు. అక్కడ ఆయన కారుపై దాడి జరిగిందని, వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు సత్యకుమార్ కారుని ధ్వంసం చేసి, ఆయనపై దాడి చేశారనేది ప్రధాన ఆరోపణ. అసలు బీజేపీ నేతలే మూడు రాజధానుల మద్దతుదారుల్ని రెచ్చగొట్టి, వారిపై దాడికి దిగారని నందిగం వర్గం ఆరోపిస్తోంది. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. రాజధాని రైతులకు మద్దతు తెలిపితే దాడులు చేస్తారా అంటూ ట్విట్టర్లో నిలదీశారు. ఓ ప్రకటన విడుదల చేశారు.


కేంద్రం జోక్యం చేసుకోవాలి..

ఈ దాడుల్ని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలన్నారు పవన్ కల్యాణ్. ప్రజాస్వామ్య పద్ధతిలోనే జగన్ కి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. బీజేపీ నేతలపై జరిగిన దాడిని అధినాయకత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. మూడు రాజధానులంటూ ప్రజల్ని జగన్ మభ్యపెట్టాలని చూస్తున్నారని, అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలు వైసీపీని తిరస్కరించారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకులని వేధిస్తూ వారిపై దౌర్జన్యాలను చేస్తున్నారని ఈ విషయాన్ని జనసేన, కేంద్రం దృష్టికి తీసుకెళ్తుందన్నారు పవన్ కల్యాణ్. మొత్తమ్మీద చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్, బీజేపీకి సపోర్ట్ గా మాట్లాడటం మాత్రం విశేషం.

First Published:  1 April 2023 2:07 AM GMT
Next Story