Telugu Global
Andhra Pradesh

పదవి కావాలంటే మోదీ ఎప్పుడో ఇచ్చేవారు..! ఇంకా భ్రమల్లోనే పవన్

పిఠాపురంలో తన గెలుపు గ్యారెంటీ అంటున్నారు పవన్. గాజువాక ప్రజలు తనను ఓడించినా బాధపడలేదని, వారు తనను గుండెల్లో పెట్టుకోవడమే గెలుపుగా భావించానని అన్నారు.

పదవి కావాలంటే మోదీ ఎప్పుడో ఇచ్చేవారు..! ఇంకా భ్రమల్లోనే పవన్
X

కేంద్రంలో తనకు పదవి కావాలంటే ప్రధాని మోదీ ఎప్పుడో ఇచ్చేవారని అన్నారు పవన్ కల్యాణ్. తనకు పదవులపై ఆశ లేదని, ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే తాను ఆలోచిస్తున్నానని, అందుకే కూటమి కట్టి ప్రజలకోసం వచ్చానని చెప్పారు. అనకాపల్లిలో వారాహి విజయభేరి యాత్రలో పాల్గొన్న ఆయన మరోసారి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. ఒక్క ఎమ్మెల్యేకూడా లేని పార్టీకి, స్వయానా రెండు ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆ పార్టీ అధినేతకు.. మోదీ పిలిచి ఎందుకు పదవి ఇస్తారో పవన్ కే తెలియాలి.


జగన్ పై అక్కసు..

రాష్ట్రాన్ని డ్రగ్స్ కేపిటల్ గా మార్చేశారంటూ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు పవన్ కల్యాణ్. యువతను మత్తులోకి దించుతున్న క్రిమినల్ గవర్నమెంట్ ఇదని అన్నారు. ప్రజలంతా మద్దతిస్తే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి, వారిని ఈడ్చి రాష్ట్ర సరిహద్దుల్లో పడేస్తామన్నారు. అమ్మఒడి పథకంపై కూడా తన అక్కసు వెళ్లగక్కారు పవన్. ఇంటిలో ప్రతి బిడ్డకు ఆ పథకం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మద్యం అమ్మకాలతో లక్షలకోట్లు ఆదాయం తెచ్చుకుని, అందులో కొంత పథకాలకు ఖర్చు చేశారన్నారు పవన్. జగన్‌ ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదని, ఇక్కడి ప్రభుత్వ భూములను తనఖా పెట్టేసి, ప్రభుత్వ కార్యాలయాలను మాత్రం అద్దె ఇళ్లలో నడుపుతున్నారని ఎద్దేవా చేశారు.

పిఠాపురంలో గెలుపు గ్యారెంటీ..

పిఠాపురంలో తన గెలుపు గ్యారెంటీ అంటున్నారు పవన్. గాజువాక ప్రజలు తనను ఓడించినా బాధపడలేదని, వారు తనను గుండెల్లో పెట్టుకోవడమే గెలుపుగా భావించానని అన్నారు. ఈసారి పిఠాపురం నుంచి గెలిచి అనకాపల్లిలోని నూకాలమ్మ దర్శనానికి వస్తానని చెప్పారు. కొత్త ప్రభుత్వంలో నూకాలమ్మ జాతరను రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తామన్నారు.

పవన్ కల్యాణ్ ఇంకా భ్రమల్లోనే ఉన్నారనే విషయం ఆయన ప్రసంగాల ద్వారా స్పష్టమవుతోంది. కూటమి సృష్టిక్తరను తానేనని చెప్పుకుంటున్న పవన్.. ఆ కూటమి వల్ల జనసేనకు తీరని నష్టం జరిగిందనే విషయాన్ని మాత్రం ఒప్పుకోవడంలేదు. జనసేనకు వచ్చిన సీట్లను కూడా టీడీపీ నేతలకు కట్టబెట్టి సొంత పార్టీ నేతలకు మరింత ద్రోహం చేశారు పవన్. ఇప్పుడు కూటమి నేతల తరపున ప్రచారానికి తిరుగుతున్నారు.

First Published:  8 April 2024 3:38 AM GMT
Next Story