Telugu Global
Andhra Pradesh

స్థానాలు కాదు.. స్ట్రైక్ రేటే ముఖ్యం - పవన్ కళ్యాణ్

జనసేన 60 నుంచి 70 స్థానాల్లో పోటీ చేస్తే బాగుంటుందని.. కొందరు అంటున్నారని.. అయితే గత ఎన్నికల్లో జనసేనను కనీసం 10 స్థానాల్లో గెలిపించి ఉంటే ఇప్పుడు ఎక్కువ స్థానాలు అడిగేందుకు అవకాశం ఉండేదని పవన్ అన్నారు.

స్థానాలు కాదు.. స్ట్రైక్ రేటే ముఖ్యం - పవన్ కళ్యాణ్
X

టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా ఇవాళ విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న 175 స్థానాలకుగాను టీడీపీ జనసేనకు 24 స్థానాలు కేటాయించింది. ఈ సందర్భంగా మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాము ఎన్ని స్థానాలు తీసుకున్నది ముఖ్యం కాదని.. స్ట్రైక్ రేటే ముఖ్యమని అన్నారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను మాత్రమే పోటీలో నిలుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎక్కువ సీట్లు తీసుకొని ప్రయోగాలు చేసే బదులు తక్కువ సీట్లు తీసుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. తీసుకున్నది 24 స్థానాలే అయినప్పటికీ.. 98 శాతం స్ట్రైక్ రేటు ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పవన్ తెలిపారు.

జనసేన 60 నుంచి 70 స్థానాల్లో పోటీ చేస్తే బాగుంటుందని.. కొందరు అంటున్నారని.. అయితే గత ఎన్నికల్లో జనసేనను కనీసం 10 స్థానాల్లో గెలిపించి ఉంటే ఇప్పుడు ఎక్కువ స్థానాలు అడిగేందుకు అవకాశం ఉండేదని పవన్ అన్నారు. పోటీ చేసే స్థానాలు 24 మాత్రమే కనిపిస్తున్నాయని.. అయితే మూడు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుండడం వల్ల మొత్తం 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లే లెక్క.. అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

తీవ్ర అసంతృప్తిలో జనసైనికులు

ఎన్నికల్లో జనసేన పోటీ చేసేది 24 స్థానాలు అని తెలిసినప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మాత్రం దానికి ఇంత తతంగం నడపడం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. సొంతంగా పోటీ చేస్తే సరిపోతుంది కదా? పొత్తు ఎందుకు అని అభిప్రాయపడుతున్నారు. పోటీ చేసేది 24 స్థానాల్లో అయినా.. మూడు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుండడం వల్ల మొత్తం 40 స్థానాల్లో పోటీ చేసినట్లే లెక్క అని పవన్ ప్రకటించడం పైన కూడా జనసైనికులు విమర్శలు చేస్తున్నారు.

మూడు లోక్ సభ స్థానాల్లో పోటీ చేసినంత మాత్రాన 40 స్థానాల్లో పోటీ చేసినట్లు ఎలా అవుతుందని వారు పవన్ ని నిలదీస్తున్నారు. జనసేన ఇన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని.. సోషల్ మీడియాలో నిన్నటి వరకు హంగామా చేసిన జనసైనికులు తమ పార్టీ పోటీ చేసేది 24 స్థానాల్లో మాత్రమే అని తెలియడంతో తీవ్ర నిరాశకు లోనై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

First Published:  24 Feb 2024 11:57 AM GMT
Next Story