Telugu Global
Andhra Pradesh

ముగిసిన పవన్ కల్యాణ్ విశాఖ ఎపిసోడ్

విశాఖ వదిలి వెళ్తానని పోలీసులకు పవన్ కల్యాణ్ చెప్ప‌డంతో వారు దగ్గరుండి బందోబస్తుతో ఎయిర్‌పోర్టులో దిగబెట్టారు. విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో పవన్‌ విజయవాడకు వెళ్లిపోయారు.

ముగిసిన పవన్ కల్యాణ్ విశాఖ ఎపిసోడ్
X

విశాఖ వేదికగా పవన్ కల్యాణ్ ఎపిసోడ్‌ ముగిసింది. పవన్ జనవాణి కోసం విశాఖ రాగా స్వాగతం పలికేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడి చేశారు. పైగా జనసేన కార్యకర్తల చర్యను ఖండించకపోగా మంత్రులే చేయించుకున్నారేమో అని పవన్ మాట్లాడడంతో పోలీసులు మరింత గట్టిగా నిలబడ్డారు. సెక్షన్ 30 ఉన్నా ర్యాలీ నిర్వహించినందుకు నోటీసులు ఇచ్చారు. విశాఖను వదిలి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. అందుకు నిరాకరించిన పవన్ కల్యాణ్ నిన్నటి నుంచి హోటల్లోనే ఉన్నారు.

సోమవారం పోలీసుల మరిన్ని ఆంక్షలు విధించారు. భారీగా ఫ్యాన్స్ వచ్చి మరోసారి అల్లరి చేసే అవకాశం ఉందన్న భావనతో.. హోటల్‌లోకి వెళ్లే వారిపైనా నియంత్రణ విధించారు. పవన్‌ కల్యాణ్‌ను ఎవరు కలవాలన్నా ఏసీపీ అనుమతి తీసుకోవాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు. దాంతో పార్టీ నేతలతో భేటీలకు కూడా అవకాశం లేకుండా పోయింది.

ఇలాగే మొండి కేస్తే పవన్‌ కల్యాణ్‌ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నచర్చ నడిచింది. మంత్రులపై దాడి కేసులో అరెస్ట్ అయిన వారిని వదిలిపెట్టే వరకు తాను కదలబోనని పవన్ కల్యాణ్ మొండి కేస్తే , ఆయన కూడా ఏదో ఒకటి చేస్తే వారితో పాటు లోపలేస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ హెచ్చరించారు. పవన్ కల్యాణ్ విశాఖలో ఉన్నంత వరకు ఆడ పిల్లలు బయటకు రావొద్దని.. పొరపాటున వస్తే తాళి కట్టేస్తాడేమో అన్న భయం ఉందన్నారు మంత్రి.

పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం, అడుగు బయటకు పెట్టే పరిస్థితి లేకపోవడంతో తాను విశాఖ వదిలి వెళ్తానని పోలీసులకు పవన్ కల్యాణ్ చెప్పారు. దాంతో పోలీసులు దగ్గరుండి బందోబస్తుతో ఎయిర్‌పోర్టులో దిగబెట్టారు. విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో పవన్‌ కల్యాణ్ విజయవాడకు వెళ్లిపోయారు. మంగళవారం గవర్నర్‌కు కలిసేందుకు పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోరారు. విశాఖ పరిణామాలు, పోలీసుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తారని చెబుతున్నారు.

Next Story