Telugu Global
Andhra Pradesh

నీతులు చెప్పిన జగన్.. నీ పుట్టినరోజున ఫ్లెక్సీలెందుకు –పవన్

యూనివర్శిటీ వీసీలకు వైసీపీ పట్ల ప్రత్యేక ప్రేమ, సీఎంపై అనురాగం ఉంటే వాటిని ఇంటికే పరిమితం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం పవన్ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

నీతులు చెప్పిన జగన్.. నీ పుట్టినరోజున ఫ్లెక్సీలెందుకు –పవన్
X

ఆమధ్య ఏపీలో ఫ్లెక్సీలను బ్యాన్ చేస్తున్నామంటూ పెద్ద హడావిడి చేశారు. ఫ్లెక్సీలు పర్యావరణానికి హాని చేస్తున్నాయని తక్షణం వాటిని నిషేధించకపోతే చెడు జరిగిపోతుందని అన్నారు, వెంటనే జీవోలు తెచ్చారు, ఫ్లెక్సీ తయారీదారులు గొడవ చేసినా కుదరదు పొమ్మన్నారు. ఇదంతా పవన్ కల్యాణ్ పుట్టినరోజున ఫ్లెక్సీలు పడకుండా చేసేందుకు వైసీపీ చేసిన హడావిడి అంటూ జనసేన ఆరోపించింది. కట్ చేస్తే అదే నిజమనిపించేలా ఫ్లెక్సీల నిషేధాన్ని నిరవధికంగా ఎత్తేసింది ఏపీ ప్రభుత్వం. ఆ తర్వాత యధావిధిగా అన్నీ మామూలుగానే జరిగిపోతున్నాయి. తాజాగా సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఓ రేంజ్ లో ఫ్లెక్సీలు వేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లు, చోటామోటా నేతలు.. గ్రామాలు, పట్టణాలను ఫ్లెక్సీలతో నింపేశారు. జగన్ ఫ్లెక్సీలు కాబట్టి ఎవరూ ఎక్కడా ఆక్షేపించలేదు. అయితే పవన్ కల్యాణ్ సడన్ ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు నీతులు చెప్పిన జగన్, ఇప్పుడిదేం పని అంటూ నిలదీశారు. ఈమేరకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు పవన్ కల్యాణ్.


యూనివర్శిటీలో కూడానా..?

చివరకు యూనివర్శిటీల్లో కూడా సీఎం జగన్ ఫ్లెక్సీలు కట్టారని, అసలు విశ్వవిద్యాలయాల్లో చదువు చెబుతారా లేక అధికార పార్టీ కార్యకర్తలను తయారు చేస్తున్నారా అని నిలదీశారు పవన్ కల్యాణ్. విశ్వవిద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చేశారని మండిపడ్డారు. సీఎం ఫ్లెక్సీలతో యూనివర్శిటీ కాంపౌండ్ లను నింపేసిన తీరు విద్యార్థి లోకానికి, సమాజానికి ఏం సూచిస్తోందని ప్రశ్నించారు. ప్లెక్సీల వల్ల పర్యావరణానికి ఎనలేని హాని కలుగుతుందని సందేశమిచ్చిన జగన్ కి శుభాకాంక్షలు చెప్పడానికి ప్లెక్సీలు కట్టడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు.

చిల్లర రాజకీయాలెందుకు..?

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌, సర్‌ సి.ఆర్‌.రెడ్డి లాంటి మేథావులు ఉపకులపతులుగా బాధ్యతలు నిర్వర్తించిన సరస్వతి ప్రాంగణం ఆంధ్ర విశ్వవిద్యాలయం అని, ఆ విద్యావనం నుంచి ఎందరో మేధావులు వచ్చారని, అలాంటి చోట చిల్లర రాజకీయాలు చేస్తూ, పార్టీ ప్లెక్సీలు కట్టించేవాళ్లు కీలక బాధ్యతల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఆలోచించాలన్నారు పవన్. యూనివర్శిటీ వీసీలకు వైసీపీ పట్ల ప్రత్యేక ప్రేమ, సీఎంపై అనురాగం ఉంటే వాటిని ఇంటికే పరిమితం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం పవన్ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. గతంలో ఫ్లెక్సీల గురించి సీఎం జగన్ చెప్పిన స్పీచ్ ని ఇప్పుడు రిపీట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు జనసేన నేతలు. ఏపీలో ఫ్లెక్సీల బ్యాన్ ఒక డ్రామా అంటూ గతంలో తాము చెప్పిన మాటలే ఇప్పుడు నిజమయ్యాయని అంటున్నారు.

First Published:  22 Dec 2022 1:48 PM GMT
Next Story