Telugu Global
Andhra Pradesh

జగన్ ప్రభుత్వంపై పవన్ ఘాటు వ్యాఖ్యలు..

బాధిత రైతులకు అండగా నిలిచి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. దెబ్బ తిన్న పంటల గణనను సత్వరమే చేపట్టి, మానవతా దృక్పథంతో నష్ట పరిహారాన్ని చెల్లించాలని కోరారు పవన్.

జగన్ ప్రభుత్వంపై పవన్ ఘాటు వ్యాఖ్యలు..
X

రైతు భరోసా కేంద్రాలంటూ వైసీపీ ప్రభుత్వం షో చేసిందని, వాటివల్ల ఉపయోగం లేకపోవడంతో ఏపీలోని రైతులంతా పంటను మిల్లర్లకు తెగనమ్ముకుంటున్నారని అన్నారు పవన్ కల్యాణ్. రైతులను వైసీపీ ప్రభుత్వం నిండా ముంచేసిందని ధ్వజమెత్తారు.


ఏపీ రైతులు వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు పకడ్బందీగా సాగటం లేదని విమర్శించారు. గోదావరి జిల్లాల్లో సాగు చేసిన జయ రకం ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. ఆర్బీకేల్లో తీసుకోకపోవడం వల్ల బస్తాకు రూ.300 నష్టంతో మిల్లర్లకు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ వైఖరి మూలంగా కష్టపడిన రైతు నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు పవన్.


అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకోవాలంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైందన్నారు. ప్రాథమిక అంచనా మేరకు 3 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయని వివరించారు. వరి, మామిడి, మొక్కజొన్న, అరటి, మిరప రైతులు ఆవేదనలో ఉన్నారని చెప్పారు. బాధిత రైతులకు అండగా నిలిచి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. దెబ్బ తిన్న పంటల గణనను సత్వరమే చేపట్టి, మానవతా దృక్పథంతో నష్ట పరిహారాన్ని చెల్లించాలని కోరారు.

వారి ఆవేదన నాకు తెలుసు..

ప్రకృతి విపత్తులతో నష్టపోయే రైతులు, ముఖ్యంగా కౌలు రైతుల వేదన తాను కళ్లారా చూశానని చెప్పారు పవన్ కల్యాణ్. నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులను వారి పొలాల్లో, కళ్ళాల్లో కలిసినప్పుడు వారి బాధలు తనతో చెప్పుకున్నారని వివరించారు.


కౌలు రైతు భరోసా యాత్రలో కూడా రైతుల కష్టాలు తనకు తెలిశాయన్నారు. జనసేన అధికారంలోకి వస్తే.. ప్రకృతి విపత్తుల కారణంగా పంటలు కోల్పోతున్న రైతులను ఆదుకొనేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. దీని గురించి ఇప్పటికే రైతు ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చిస్తున్నామని తెలిపారు పవన్.

First Published:  2 May 2023 7:03 AM GMT
Next Story