Telugu Global
Andhra Pradesh

దయచేసి నన్ను గెలిపించండి.. ప్రజలకు సేవ చేసుకుంటా

రెండు చేతులు జోడించి అడుగుతున్నానని, తనను గెలిపించాలని కోరారు పవన్. పిఠాపురం నుంచి తన యాత్రను మొదలు పెట్టారు.

దయచేసి నన్ను గెలిపించండి.. ప్రజలకు సేవ చేసుకుంటా
X

ఓడిపోయినా దశాబ్ధ కాలం నుంచి ఒంటరిగా పోరాటం చేస్తున్నానని అన్నారు పవన్ కల్యాణ్. దయచేసి తనను గెలిపించాలని, ప్రజల ఆశీర్వాదం తనకు కావాలని, గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. గతంలో లాగా వీరావేశంతో మాట్లాడకుండా.. పిఠాపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో వినమ్రంగా తనను గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు పవన్. రెండు చేతులు జోడించి అడుగుతున్నానని, తనను గెలిపించాలని కోరారు. పిఠాపురం నుంచి తన యాత్రను మొదలు పెట్టారు పవన్.


గతంలో పవన్ వారాహి ఎక్కితే ఆయనే సోలో హీరో. కానీ పిఠాపురంలో సీన్ మారింది. వాహనంపై అటు టీడీపీ నేత వర్మ, ఇటు మరో బీజేపీ నేత, ఇంకొకరు జనసేన నుంచి కూడా ఉన్నారు. అందరితో కలసి ప్రచారంలో పాల్గొనటం అలవాటు చేసుకున్నారు పవన్. పిఠాపురంలో పోటీ చేయాలని తాను కలలో కూడా అనుకోలేదని.. సమస్యలు తనవి అనుకున్నాను తప్ప నియోజకవర్గం గురించి ఆలోచించలేదని చెప్పారాయన. పిఠాపురంలో లక్ష మెజారిటీతో తనను గెలిపిస్తానని అంటున్నారని.. వారందరికీ తానెప్పుడూ రుణపడి ఉంటానన్నారు. వైసీపీ ఫ్యాన్‌కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ అని ఎద్దేవా చేశారు పవన్.

యాక్షన్ ప్లాన్..

పిఠాపురం అభివృద్ధికి తన వద్ద యాక్షన్ ప్లాన్ ఉందని చెప్పారు పవన్ కల్యాణ్. 12 నుంచి 14 పాయింట్స్ తో కూడిన అభివృద్ధి ఫార్ములా తన వద్ద ఉందన్నారు. పిఠాపురంకు మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ తీసుకువస్తానని, యువతకోసం 20 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దేశంలో మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చి దిద్దుతానన్నారు. 54 గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానన్నారు.

నన్ను ఓడించడానికి ఇంతమందా..?

తనను ఓడించడానికి మిధున్ రెడ్డి వచ్చారని, ఒక్కో మండలానికి ఒక్కో నాయకుడిని ఇన్ చార్జ్ గా పెట్టారని, అందరూ తనపైనే ఫోకస్ పెట్టారని అన్నారు పవన్ కల్యాణ్. కంటైనర్లలో డబ్బులు తరలిస్తున్నారని, తనని ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పట్టుమని పాతికమంది ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టలేని తనను చూస్తే వైసీపీకి ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. తాను పిఠాపురంలోనే ఇల్లు తీసుకుంటానని, ఇక్కడే ఉంటానని చెప్పారు పవన్. తాటాకు చప్పుళ్లకు తాను భయపడి పారిపోనని, ఇక్కడే ఉంటా, పిఠాపురంను అభివృద్ధి చేసుకుంటా అని చెప్పారు.

First Published:  30 March 2024 4:44 PM GMT
Next Story