Telugu Global
Andhra Pradesh

ఆర్థిక దివాళాకోరుతనాన్ని కప్పిపుచ్చుకోడానికే పెన్షన్ల కోత..

వేల ఎకరాల భూములున్నాయని అందుకే పెన్షన్లు తొలగిస్తున్నామని కొంతమంది లబ్ధిదారులకు నోటీసులొచ్చాయని, అదే నిజమైతే ఆ భూములకు సంబంధించి వారికి పట్టాదార్ పాసు పుస్తకాలు ఇవ్వాలని సీఎం జగన్ కి విజ్ఞప్తి చేశారు పవన్ కల్యాణ్.

ఆర్థిక దివాళాకోరుతనాన్ని కప్పిపుచ్చుకోడానికే పెన్షన్ల కోత..
X

ఏపీలో పెన్షన్ల కోత విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ ఆర్థిక దివాళాకోరుతనాన్ని కప్పి పుచ్చుకోడానికే పెన్షన్లలో కోత పెడుతున్నారని మండిపడ్డారు. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం జగన్ కు ఆయన లేఖ రాశారు. విపక్షాలు, మీడియా వాస్తవ పరిస్థితులు తెలియజేస్తుంటే వారిని తిట్టాలంటూ కలెక్టర్లకు ఆదేశాలివ్వడమేంటని మండిపడ్డారు. పెన్షన్లు తొలగిస్తున్నామంటూ లబ్ధిదారులకు అందిస్తున్న నోటీసుల్లో కారణాలు సహేతుకంగా లేవన్నారు పవన్ కల్యాణ్.

ఆ పొలాలు, స్థలాలు అప్పగించండి..

వేల ఎకరాల భూములున్నాయని అందుకే పెన్షన్లు తొలగిస్తున్నామని కొంతమంది లబ్ధిదారులకు నోటీసులొచ్చాయని, అదే నిజమైతే ఆ వేల ఎకరాల భూములకు సంబంధించి వారికి పట్టాదార్ పాసు పుస్తకాలు ఇవ్వాలని సీఎం జగన్ కి విజ్ఞప్తి చేశారు పవన్ కల్యాణ్. పెనుకొండలో ఓ మహిళకు 158 ఇళ్లు ఉన్నాయని నోటీసులిచ్చారని, అదే నిజమైతే ఆ ఇళ్లను ఆమెకు తిరిగి అప్పగించాలని కోరారు. అంతటి ఆస్తిపరులైతే వారంతా పెన్షన్లకోసం సచివాలయాల చుట్టూ, వాలంటీర్ల చుట్టూ ఎందుకు తిరుగుతారని ప్రశ్నించారు పవన్ కల్యాణ్.


వికలాంగుల పరిస్థితి కళ్లకు కనిపిస్తున్నా వారిని సర్టిఫికెట్ల కోసం ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు పవన్ కల్యాణ్. పదేళ్లుగా పెన్షన్ తీసుకుంటున్నవారిని కూడా ఇప్పుడు మళ్లీ వికలాంగ సర్టిఫికెట్ ఇవ్వాలనడంలో న్యాయం ఎక్కడుందని నిలదీశారు. రాజకీయ కారణాలతో కూడా పెన్షన్లు ఆపేస్తున్నారని మండిపడ్డారు పవన్. ప్రతినెలా ఇచ్చే పెన్షన్లను తగ్గించడం కోసం ప్రభుత్వం ఇలా నోటీసులివ్వడం సరికాదన్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించి అందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు.

First Published:  28 Dec 2022 5:41 PM GMT
Next Story