Telugu Global
Andhra Pradesh

పవన్ చిన్న లాజిక్ మిస్సయ్యారా?

ఏలూరులో ప‌వ‌న్‌ మాట్లాడుతూ మహిళల మిసింగ్‌ను హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పి దాన్ని వలంటీర్లకు ముడిపెట్టారు. ఇక్కడే పవన్ చిన్న లాజిక్ మిస్ అయ్యారు. అదేమిటంటే మిస్సింగ్ వేరు హ్యూమన్ ట్రాఫికింగ్ వేరు.

పవన్ చిన్న లాజిక్ మిస్సయ్యారా?
X

ల‌క్ష‌ల‌ పుస్తకాలను చదివానంటారు. ప్రపంచం మొత్తాన్ని చదువుతున్నట్లు చెబుతారు. మాట్లాడితే చట్టాలు, న్యాయం గురించి ఊకదంపుడు ఉపన్యాసాలిస్తారు. కానీ చిన్న లాజిక్ మిస్సయ్యారు. ఇదంతా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించే అని అర్థ‌మైపోయుంటుంది. తూర్పుగోదావరి జిల్లా వారాహి యాత్రలో మాట్లాడుతూ ఏపీలో 30 వేల మంది మహిళలు మిస్సయ్యారని ఆరోపించారు. అయితే అప్పుడు పవన్ ఆరోపణను ఎవరు పట్టించుకోలేదు. అందుకనే ఏమో ఏలూరులో మాట్లాడుతూ.. మహిళల మిసింగ్‌ను హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పి దాన్ని వలంటీర్లకు ముడిపెట్టారు.

ఇంకేముంది పవన్ అనుకున్నట్లే స్పందన మొదలై రాష్ట్రమంతా రచ్చ జరుగుతోంది. ఏదోరూపంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత తీసుకురావటమే పవన్ టార్గెట్.నిజానికి చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియా ఈ విషయంలో ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నా సాధ్యంకావటంలేదు. అందుకనే తాజాగా పవన్‌ను రంగంలోకి దింపినట్లున్నారు. అయితే పవన్ కూడా ముందు వెనక ఆలోచించకుండా హ్యూమన్ ట్రాఫికింగ్ అని ఆరోపించేశారు. ఇక్కడే పవన్ చిన్న లాజిక్ మిస్ అయ్యారు.

అదేమిటంటే మిస్సింగ్ వేరు ట్రాఫికింగ్ వేరు. ఉదాహరణకు 100 మంది అమ్మాయిలు మిస్ అయితే అందులో 95 మంది ఆచూకి రెండు, మూడు రోజుల్లోనే తెలిసిపోతుంది. ఎలాగంటే అమ్మాయిలు మిస్సవటంలో ఎక్కవ భాగం ప్రేమ, పెళ్ళిళ్ళే కారణమవుతాయి. ఈ విషయం తల్లిదండ్రులకు కూడా తెలుసు. అయితే ఆ విషయం చెప్పకుండా తమ కూతురు మిస్సయిందని మాత్రమే ఫిర్యాదు చేస్తారు. ఇక మిగిలిన కేసులు ఏవంటే పరీక్షల్లో తప్పటం, కుటుంబంలో గొడవల కారణంగా అలిగి వెళ్ళిపోవటం, బలవంతపు వివాహాలు లాంటి కారణాలుంటాయి.

ఇలాంటి వాటిని పోలీసులు మిస్సింగనే నోట్ చేసుకుంటారు. అయితే కొద్దిరోజుల తర్వాత కేసు క్లోజ్ చేస్తారు. కొన్ని కేసుల్లో మాత్రమే అమ్మాయిల ఆచూకీ తెలియ‌దు. వీటిని హ్యూమన్ ట్రాఫికింగ్ అనే కోణంలో దర్యాప్తు చేస్తారు. హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందనేందుకు పోలీసులకు దొరికిన ఆధారాల కారణంగా, అనుమానాలతో దర్యాప్తు చేస్తారు. అంటే మిస్సింగ్ వేరు హ్యూమన్ ట్రాఫికింగ్ వేరన్న విషయం అర్థ‌మవుతోంది. ఇంత చిన్న లాజిక్‌ను పవన్ మిస్సయిపోయి వేలాదిమంది మహిళల హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని దానికి వలంటీర్లే కారణమని అనటం చాలా దారుణం.

First Published:  12 July 2023 5:32 AM GMT
Next Story