Telugu Global
Andhra Pradesh

పవన్ కి చెబితే సమస్యలు తీరిపోతాయా..? జనవాణి ఉద్దేశమేంటి..?

జనవాణి అంతా సెల్ఫ్ డబ్బా కార్యక్రమమే. పవన్ తో ఫొటో దిగేందుకు అభిమానులు అర్జీలు పట్టుకుని వస్తారు, వారిలో కొందర్ని సెలక్ట్ చేసుకుని జనసేనాని నేరుగా ఆర్థిక సాయం చేస్తారు. ప్రభుత్వం చేయలేకపోయింది, నేను చేసి చూపించానంటూ బిల్డప్ ఇస్తారు. ఈ రోజు మచిలీపట్నంలో జరుగుతోంది కూడా ఇదే.

పవన్ కి చెబితే సమస్యలు తీరిపోతాయా..? జనవాణి ఉద్దేశమేంటి..?
X

జనవాణి అంటు పవన్ కల్యాణ్ ప్రైవేటు పంచాయితీలు పెడుతున్నారు. జనసేన నాయకులే కొంతమందిని సమీకరించి జనవాణి అర్జీలు అంటూ పవన్ వద్దకు పంపిస్తున్నారు. పవన్ తో ఫొటో దిగే అవకాశముంటుంది కాబట్టి, చాలామంది ఉత్సాహంగా అర్జీలు పట్టుకుని వెళ్తున్నారు. వారందర్నీ చూసి ఆయన ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. ఇంతమంది ఏపీలో సమస్యలతో అల్లాడిపోతుంటే ప్రభుత్వానికి పట్టడంలేదంటూ వీరావేశంతో ప్రసంగాలిస్తున్నారు. అసలు జనవాణి ఉద్దేశమేంటి..? అక్కడికి వస్తున్న బాధితుల సమస్యలు తీరేదెలా..?


ఏపీ ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో స్పందన అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. జిల్లా కలెక్టర్ దగ్గర్నుంచి తహశీల్దార్ల వరకు అందరూ ఆరోజు స్పందనలో పాల్గొనాల్సిందే. అర్జీలు స్వీకరించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని వారు హామీ ఇస్తారు, పని మొదలు పెడతారు. ఇవి కాకుండా స్పెషల్ స్పందన అంటూ నెలకోసారి ఓ ప్రాంతాన్ని వేదికగా చేసుకుని కార్యక్రమం నిర్వహిస్తారు. వీటికితోడు ఆ మధ్య జగనన్నకు చెబుదాం అంటూ మరో కార్యక్రమం కూడా చేపట్టారు. ఇన్ని వేదికలను దాటుకుని ఇంకా జనం పవన్ కి సమస్యలు చెప్పుకోవడం ఏంటి..? పవన్ కి చెప్పుకుంటే అవి అంత ఈజీగా పరిష్కారం అవుతాయా..?

జనవాణి అంత అద్భుతమైన కార్యక్రమం అయితే, కచ్చితంగా టీడీపీ కూడా అలాంటి కార్యక్రమాలు చేపట్టేది. కానీ జనవాణి అంతా సెల్ఫ్ డబ్బా కార్యక్రమమే. పవన్ తో ఫొటో దిగేందుకు అభిమానులు అర్జీలు పట్టుకుని వస్తారు, వారిలో కొందర్ని సెలక్ట్ చేసుకుని జనసేనాని నేరుగా ఆర్థిక సాయం చేస్తారు. ప్రభుత్వం చేయలేకపోయింది, నేను చేసి చూపించానంటూ బిల్డప్ ఇస్తారు. ఈ రోజు మచిలీపట్నంలో జరుగుతోంది కూడా ఇదే. జనవాణికి ప్రజలు పోటెత్తారంటూ టీడీపీ అనుకూల మీడియా జనసేనను భుజానికెత్తుకుంది. బాబు బయటకొచ్చే వరకు ఆ భారం మోయడానికి సిద్ధమైపోయింది. ఆత్మస్తుతి - పరనిందలాగా జనవాణి జరుగుతోంది. సమస్యలు చెప్పుకోడానికి వచ్చినవారిలో కనీసం 10శాతం మంది అయినా జనసేనకు ఓటు వేస్తారా అంటే అనుమానమే.


First Published:  3 Oct 2023 7:02 AM GMT
Next Story