Telugu Global
Andhra Pradesh

వీకెండ్ పొలిటీషియన్ పవన్ - పేర్ని నాని కౌంటర్లు

2019 తర్వాత పొలిటికల్ ఆక్టోపస్ కనుమరుగైందని, అప్పటినుంచి పొలిటికల్ ప్యారెట్ వచ్చిందని, పవన్ రాజకీయ చిలకలా మారి చిలక జోస్యం చెబుతున్నారని సెటైర్లు వేశారు పేర్ని నాని.

వీకెండ్ పొలిటీషియన్ పవన్ - పేర్ని నాని కౌంటర్లు
X

పవన్ కల్యాణ్ వారాంతపు రాజకీయ నాయకుడు అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆదివారం రాగానే పవన్ కల్యాణ్ మళ్లీ మీడియా ముందుకొచ్చారని అన్నారు. తన ముందు కూర్చున్నవారు, తన ప్రసంగాన్ని టీవీల్లో, సోషల్ మీడియాలో చూసేవారంతా మతిమరుపుతో ఉన్నారని, పవన్ భావిస్తుంటారని ఎద్దేవా చేశారు. ఎవరికీ ఏమీ గుర్తుండదనే భ్రమలో ఉండే రాజకీయ నాయకుడు పవన్ అని వ్యాఖ్యానించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రజలకు ద్రోహం చేసి వెళ్లిపోయినట్టు, ఆయన రాజకీయంగా చాలా తప్పులు చేసినట్టు పవన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ చాలా పునీతుడైనట్టు సూక్తి ముక్తావళి చెబుతున్నారని అన్నారు. అన్న నీడలో పెరిగి, చిరంజీవి చల్లని దయతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్, ఇప్పుడు అన్న చెడిపోయినట్టు, తాను పత్తిత్తు అయిపోయినట్టు మాట్లాడటం దారుణం అన్నారు నాని.

చిరంజీవికి వెన్నుపోటు..

చిరంజీవి నిఖార్సయిన రాజకీయ నాయకుడని, ఆయన 294 నియోజకవర్గాల్లో తన పార్టీ నేతల్ని పోటీకి పెట్టారని, ఆయన గెలిచి, ఆయన తరపున ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారని చెప్పారు నాని. అప్పట్లో ప్రజారాజ్యానికి ఆశించిన ఫలితాలు రాకపోయేసరికి యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న పవన్, పార్టీ కార్యాలయానికి మొహం చాటేశారని అన్నారు. అప్పుడెందుకు పవన్ పారిపోయాడని, ప్రజారాజ్యానికి రాజీనామా కూడా చేయకుండా అడ్రస్ లేకుండా ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీకి, సొంత అన్నకి వెన్నుపోటు పొడిచిన ఆయన, ఇప్పుడు చిరంజీవిని తప్పుబడుతూ మాట్లాడ్డం సరికాదన్నారు. రాజకీయాల్లో చిరంజీవి మగాడని, పవన్ కల్యాణ్ కాదని అన్నారు.

జగన్ పై పడి ఏడవడమే పని..

గతంలో నయవంచకుడు చంద్రబాబు అన్నది పవన్ కల్యాణే అని, సైకిల్ గుర్తు కూడా చంద్రబాబుకి కాదని అన్నది కూడా పవన్ కల్యాణే అని గుర్తు చేశారు పేర్ని నాని. ఇప్పుడు గానుగ ఎద్దులాగా కళ్లకు గంతలు కట్టుకుని చంద్రబాబు చెప్పినట్టల్లా చేస్తున్నారని విమర్శించారు. ఎక్స్ పయిరీ డేట్ గురించి మాట్లాడే పవన్, 50 ఏళ్లకు చేరువయ్యారు కదా అని గుర్తు చేశారు. ఆయనకు ఎక్స్ పయిరీ లేదా అని అన్నారు. వస్తువు అయినా, ప్రభుత్వం అయినా, రాజకీయ పార్టీ అయినా.. కంటెంట్ ఉందా లేదా అనేది కూడా ఆలోచిస్తారని, అసలు పవన్ వల్ల ఎవరికి ఉపయోగం ఉందని ప్రశ్నించారు. జనసేన వల్ల చంద్రబాబు, లోకేష్, పవన్ నాయుడు లాభం పొందారు కానీ జనసైనికులకు లాభం లేదన్నారు.

రాజకీయ చిలక పవన్..

2019 తర్వాత పొలిటికల్ ఆక్టోపస్ కుమరుగైందని, అప్పటినుంచి పొలిటికల్ ప్యారెట్ వచ్చిందని, పవన్ రాజకీయ చిలకలా మారి చిలక జోస్యం చెబుతున్నారని సెటైర్లు వేశారు నాని. వైసీపీకి 45నుంచి 67 సీట్లు వస్తాయని ఆ చిలక చెబుతోందని, మరి జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో చెప్పలేకపోవడమేంటని ప్రశ్నించారు. దసరాకి వస్తా మీ సంగతి చూస్తానన్న పవన్ కల్యాణ్ చివరకు యాత్ర లేదని తుస్సుమనిపించారని ఎద్దేవా చేశారు. కనీసం పవన్ దసరాకి పులి వేషం వేస్తారని ఆశపడ్డామని అన్నారు నాని.

అడ్వాన్స్ లకే సరి..

సినిమా నిర్మాతల దగ్గర అడ్వాన్స్ లు తీసుకోవడంలో పవన్ దిట్ట అని, ఆయన తీసుకున్న అడ్వాన్స్ లకు సినిమాలు పూర్తి చేయాలంటే 2050 సంవత్సరం వరకు టైమ్ పడుతుందన్నారు నాని. పూటకో మాట మాట్లాడే పవన్ సుగాలి ప్రీతి మరణం విషయంలో రాజకీయాలు చేస్తున్నారని, గతంలో సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ చంద్రబాబుని పవన్ ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు నాని.

అమరావతి అభివృద్ధి జగన్ హయాంలోనే జరుగుతోందని చెప్పారు పేర్ని నాని. మూడు ప్రాంతాల అభివృద్ధికి తాము కృషి చేస్తున్నామని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇస్తానంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇచ్చిన మాటమీద ఆయన నిలబడలేరని, సిట్టింగ్ లను ఆఫీస్ బయట కూర్చోబెట్టి, దొడ్డిదారిన మరొకరికి బీ-ఫామ్ ఇచ్చి పంపించేస్తారని ఎద్దేవా చేశారు. వైసీపీ సంకల్పం గొప్పదా, టీడీపీ కుట్రలు గొప్పవా అనేది 2024లో తేలిపోతుందన్నారు పేర్నినాని.

Next Story