Telugu Global
Andhra Pradesh

పెట్టుబడిదారులను పవన్ బెదిరిస్తున్నారా?

సంక్షేమ పథకాలు, అభివృద్ధి బ్యాలెన్స్ అయితే వైసీపీని ఓడించటం కష్టమని ప్రతిపక్షాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవ‌ద్ద‌ని పవన్ బెదిరింపుల్లోకి దిగేశారు.

పెట్టుబడిదారులను పవన్ బెదిరిస్తున్నారా?
X

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పిచ్చి పీక్స్‌కు చేరుకుంటున్నది. జగన్మోహన్ రెడ్డి అంటే తనకున్న ద్వేషభావాన్ని ప్రతి సందర్భంలోనూ పవన్ బయటపెట్టుకుంటునే ఉన్నారు. అందుకనే సమయం, సందర్భం లేకపోయినా జగన్‌పై బురదచల్లటమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ద్వేషభావం ఎంతదాకా వెళ్ళిపోయిందంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్ట‌వ‌ద్ద‌ని బెదిరించేదాకా. వారాహి యాత్రలో ఉన్న పవన్ గాజువాకలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు, బ్యాంకులను పెట్టుబడులు పెట్టవద్దని డైరెక్టుగానే హెచ్చరించారు.

వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రజల సమక్షంలో చెబుతున్నా బ్యాంకులు కానీ లేదా వ్యక్తులు కానీ పెట్టుబడులు పెట్టాలని వస్తే అది కచ్చితంగా డెమాలిషన్ చేసే ప్రాపర్టీయే’ అని వార్నింగ్‌ ఇచ్చారు. అంటే పవన్ ఉద్దేశంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకూడదన్నది స్పష్టంగా అర్థ‌మవుతోంది. ఒకవైపు పెట్టుబడులు రావటంలేదని, పారిశ్రామికవేత్తలను జగన్ తరిమేస్తున్నారంటూ ఆరోపణలు చేసేది వీళ్ళే. మళ్ళీ పెట్టుబడులు పెడితే అది కచ్చితంగా డెమోలిషన్ చేసే ప్రాపర్టీయే అని బెదిరిస్తున్నది వీళ్ళే.

జగన్ ప్రభుత్వం ఏ పారిశ్రామికవేత్తను తరిమేసిందంటే సమాధానం చెప్పరు. పారిశ్రామికవేత్తలను జగన్ తరమేస్తున్నాడు..తరిమేస్తున్నాడని బురదచల్లేస్తున్నారంతే. ఒక‌ప్పుడు రిలయన్స్, లూలూ, జాకీ, అదానీ కంపెనీలు వెళ్ళిపోయింది చంద్రబాబు నిర్వాకం వల్లే కానీ జగన్ ప్రభుత్వం వల్ల కాదు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎల్లో మీడియా కూడా పారిశ్రామికవేత్తలను భయపడిపోయేట్లు కథనాలు, వార్తలను అచ్చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

తామెంత ప్రయత్నించినా వైజాగ్‌లో జరిగిన పెట్టుబడుల సదస్సు గ్రాండ్ సక్సెస్ అవటాన్ని ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోంది. సదస్సు తర్వాత కొన్ని పరిశ్రమలు పనులు మొదలుపెట్టాయి, కొన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి. వీటన్నింటినీ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని మానటరింగ్ కమిటీ రెగ్యులర్‌గా ఫాలోఅప్ చేస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. మరోవైపు పరిశ్రమలు, యూనిట్లు గ్రౌండ్ అవుతున్నాయి. పథకాలు, అభివృద్ధి బ్యాలెన్స్ అయితే వైసీపీని ఓడించటం కష్టమని ప్రతిపక్షాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకని డైరెక్టుగానే పవన్ పెట్టుబడులు పెట్టవ‌ద్ద‌ని బెదిరింపుల్లోకి దిగేశారు. మరి పవన్ బెదిరింపుల పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలి.

First Published:  15 Aug 2023 4:53 AM GMT
Next Story