Telugu Global
Andhra Pradesh

తిరుపతి అసమ్మతి.. పవన్ బుజ్జగింపులు ఫలించాయా..?

తన ప్రచారాన్ని సైతం వదిలిపెట్టి తిరుపతి సీటుకోసం పవన్ రెండు రోజులు టైమ్ కేటాయించడం విశేషం. ఆయన పర్యటన తర్వాతయినా తిరుపతిలో కూటమి నేతలు కలసి పనిచేస్తారో లేదో చూడాలి.

తిరుపతి అసమ్మతి.. పవన్ బుజ్జగింపులు ఫలించాయా..?
X

2009 ఎన్నికల్లో చిరంజీవిని సొంత ప్రాంతం పాలకొల్లు తిరస్కరిస్తే.. తిరుపతి అక్కున చేర్చుకుంది. అలా ఆ నియోజకవర్గం మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్ గా మారింది. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కూడా తిరుపతి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది, కానీ సాధ్యం కాలేదు. ఈసారి కూడా పవన్ పోటీ విషయంలో తిరుపతి పేరు వినిపించినా కుదర్లేదు. అయితే పొత్తుల్లో భాగంగా ఆ సీటు జనసేనకు దక్కడం విశేషం. ఇంతవరకు బాగానే ఉన్నా.. తిరుపతి సీటుని వైసీపీ వలసనేత, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకి కేటాయించారు పవన్. దీంతో మళ్లీ గొడవ మొదలైంది. తిరుపతి సీటుపై ఆశ పెట్టుకున్న జనసేన నేతలు, టీడీపీ నేతలు, బీజేపీ నేతలు.. ఇలా అందరూ ఆరణికి వ్యతిరేకంగా మారారు. చివరకు పవన్ కల్యాణ్ వారిమధ్య సయోధ్య కుదిర్చేందుకు తిరుపతిలో మకాం వేశారు.

తిరుపతి సీటులో జనసేన విజయం.. పవన్ కల్యాణ్ కి ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే ఆయన నేరుగా తిరుపతికి వచ్చి అసంతృప్తి చల్లార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అర్థరాత్రి వరకు ఆయన టీడీపీ, జనసేన నేతలతో భేటీ అయ్యారు. నాగబాబు కూడా ఈ భేటీలో ఉన్నారు. చివరకు జనసేన అసంతృప్త నేత కిరణ్ రాయల్ మెత్తబడ్డారు. ఆరణి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పారు. ఆరణి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటామని, పవన్ కల్యాణ్ తన భవిష్యత్ కి హామీ ఇచ్చారని ఆయన అంటున్నారు. ఇక టీడీపీ నుంచి సీటు ఆశించిన సుగుణమ్మ కూడా పవన్ తో భేటీ తర్వాత స్వరం మార్చారు. రాష్ట్రంలో రాక్షస పాలన తరిమికొట్టాలని పవన్ తమకు సూచించారని, జనసేన అభ్యర్థి ఆరణి గెలుపుకోసం తాము కృషి చేస్తామన్నారు.

నేడు బీజేపీకి బుజ్జగింపులు..

నిన్న టీడీపీ, జనసేన నేతల బుజ్జగింపుల పర్వం పూర్తికాగా, నేడు తిరుపతి బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం కాబోతున్నారు. రాత్రి హోటల్ లో జరిగిన సమావేశంలో తమని పట్టించుకోలేదని బీజేపీ నేతలు భానుప్రకాష్, శాంతారెడ్డి అలిగి వెళ్లిపోయారని సమాచారం. వారితో ఈరోజు పవన్ భేటీ అవుతున్నారు. తన ప్రచారాన్ని సైతం వదిలిపెట్టి తిరుపతి సీటుకోసం పవన్ రెండు రోజులు టైమ్ కేటాయించడం విశేషం. ఆయన పర్యటన తర్వాతయినా తిరుపతిలో కూటమి నేతలు కలసి పనిచేస్తారో లేదో చూడాలి.

First Published:  13 April 2024 6:00 AM GMT
Next Story